రైతు రాజ్యం ట్రస్టు.. అన్నదాత సంక్షేమానికి 100 కోట్ల నిధి
రైతుకు పెన్షన్‌.. పిల్లలకు స్కాలర్‌షిప్
#REDDYJAGRUTHI Supports this Noble Cause

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉదయం 9గంటలకు భారీ ఎత్తున రైతుతో, ట్రస్టు ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు.

 

జన్మనిచ్చిన పల్లెలో తన మూలాలు వెతుక్కుంటూ పట్నం వదిలి వస్తాడు ‘శ్రీమంతుడు’! సొంతూర్లోనే ఉంటూ గ్రామాభివృద్ధి కోసం పల్లె జనాల్లో చైతన్యం తెస్తాడు. దగ్గరుండి ఊరిని ప్రగతిపథంలో నడిస్తాడు! లక్ష్యం ఇదే. కానీ జరిగే తీరే కాస్త భిన్నం! రైతుల అభివృద్ధే గ్రామాల అభివృద్ధి అని ఈ ‘శ్రీమంతులు’ గట్టిగా నమ్ముతున్నారు. మన ఊరు మట్టి వాసనను మరువక.. ప్రగతిని కాంక్షిస్తున్నారు. అన్నంపెట్టే రైతన్న నోట్లోకి ఐదువేళ్లూ పోయినప్పుడే.. వారి కుటుంబాలు చల్లగా ఉన్నప్పుడే గ్రామాలకు కళ వస్తుందన్నది వారి విశ్వాసం. అందుకే అన్నదాతల బలవన్మరణాలను నివారించి.. ‘‘మీకు అండగా మేం ఉన్నాం’’ అనే భరోసా ఇస్తూ సరికొత్త సంకల్పం తీసుకుంటున్నారు.....
 ఉత్తరాదిలో రైతన్నలు రుణమాఫీ కోసం ఉద్యమిస్తున్నారు. మహారాష్ట్రలో అప్పుల బాధకు అన్నదాతలు ప్రాణాలు విడుస్తున్నారు. తమిళనాడులో రైతన్నలు కరువు సాయం కోసం అంగలారుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కర్షకులు చేతికందని నగదు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా దేశమంతా మట్టి మనుషులు సమస్యలపై పోరాడుతుండగా, మహబూబాబాద్‌ జిల్లాలో మాత్రం సరికొత్త ఉద్యమ గీతం ఒకటి వినిపిస్తోంది. ‘యువతా మేలుకో.. రైతన్నను ఆదుకో’ అనే నినాదం ప్రతిధ్వనిస్తోంది. ‘రైతు రాజ్యం’ కోసం ఒక గొప్ప ప్రయత్నం ఊపందుకుంటోంది.

ఊర్లో పుట్టి, ఊర్లో పెరిగి, ఊర్లో చదువుకుని, ఊరు నుంచి ఉవ్వెత్తున ఎగసి, ఉత్తమ ఉద్యోగాల్లో విదేశాల్లో స్థిరపడిన ఉడుకు రక్తం యువకులు కొందరు సొంత ఊరు కోసం, అన్నం పెట్టిన రైతన్న కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు. దేశం కాని దేశాల్లో ఉద్యోగ, వ్యాపార బాధ్యతల్లో బిజీగా ఉంటూనే, రైతుల సంక్షేమం కోసం తలోచేయి వేయాలని నిర్ణయించుకున్నారు. వీరందరి ఉమ్మడి కృషితో రైతు రాజ్యం అనే ట్రస్ట్‌ ఒకటి ఏర్పాటైంది. దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు దీని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఉదయం 9గంటలకు భారీ ఎత్తున రైతుతో, ట్రస్టు ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. దాదాపు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.

సమ్మేళనానికి రావాల్సిందిగా భారీ స్థాయిలో రైతులను ఆహ్వానిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు అతికించారు. కరపత్రాలనూ పంపిణీ చేశారు. ఈ సభ విజయవంతం చేసేందుకు పలువురు ముఖ్యులు, పార్టీలకు అతీతంగా ఏకమయ్యారు. కాగా వివిధ గ్రామాల నుంచి విదేశాల్లో స్థిరపడిన యువకులను ట్రస్టు నిర్వాహకులు సంప్రదిస్తారు. రైతులకు సాయం చేయాల్సిన ఆవశ్యకతను వారికి వివరించి, సాయం చేసేలా ఒప్పిస్తారు. ఏ గ్రామ యువకులు ఇచ్చిన సొమ్మును ఆ గ్రామంలోని రైతుల కోసమే ఖర్చు చేస్తారు. లేదా వారి సమ్మతితో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో డబ్బులు వెచ్చిస్తారు.
 
‘రైతు రాజ్యం’ లక్ష్యాలు ఇవీ..

ప్రతి గ్రామంలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉపకారవేతనాలు. ఐదు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.500.. ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.1000 సాయం. ప్రతి గ్రామంలో 70 ఏళ్లు దాటిన రైతుకు కృతజ్ఞతా సన్మానం ఉంటుంది. ఎలాంటి సాయం దక్కని నిరుపేద రైతుకు నెలకు రూ.1500 పింఛను.
కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి నెలవారీ నిత్యావసర సరుకుల పంపిణీ. దీర్ఘకాలిక వ్యాధికి గురై, వ్యవసాయం చేసుకోలేని స్థితిలో ఉన్న రైతుకు ఆర్థిక సాయం
ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూసే రైతు కుటుంబాల అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, ఉద్యోగ కల్పన. వాతావరణ పరిస్థితులు, నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన తరగతులు. వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెట్లలో పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం. రైతులకు సంఘటిత పరిచి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు.

#REDDYJAGRUTHI Supports this Noble Cause