తరతరాలకు తరగని విజ్ఞాన గని " వేమన శతకం "
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.

వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.

 నందన సంవత్సరమున
 బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్
 బృందార కాద్రి సేతువు
 నందున నొక వీర వరుని జన్మము వేమా

యోగి వేమన

"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. . వేమన చరిత్ర చాలా మంది పరిశోధకులు కృషి చేసినా అస్పష్టంగా వుంది.

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలదితో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.

జీవితం

వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.

వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.

 నందన సంవత్సరమున
 బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్
 బృందార కాద్రి సేతువు
 నందున నొక వీర వరుని జన్మము వేమా!
                   పై పద్యంలో వేమన ఆచార్యులు రెండు గొప్ప కొండల నడుమనున్న సేతువు తన జన్మ స్థలం అని చెప్పారు. రెండు కొండలను నడుమ నుండి పారే నదులు మనకు చాల ఉన్నాయి, ఉదాహరణకు కృష్ణ నది. కానీ అవి సేతువు ఏర్పరచలేదు . మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ప్రదేశం ఉండేది వైఎస్ఆర్ జిల్లాలో వేంపల్లికి దగ్గరలో నున్న "గండి"లో "వీరన్న గట్టు పల్లి" అనే గ్రామం వేమన గారి జన్మస్థలం. పాపాగ్ని నది ఇ క్కడి శేషాచల కొండల శ్రేణిని రెండుగా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది. వేమన జన్మస్థలం వీరన్నగట్టుపల్లి అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఉంది.

ప్రాచుర్యంలో ఉన్న మరో ఇతివృత్తం ప్రకారం వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు.

1820 లో మద్రాసు గవర్నర్ గా నియమితులైన 'సర్ థోమస్ మన్రో' గారు పన్నులు వసూలు చేసే నిమిత్తం కడపలో నున్న గండికి ప్రవేశించారు. అక్కడ ఆయనకు బంగారు తోరణాలు కనిపించాయి. వారు తన సైనికులతో ఆ విషయం చెప్పగా, వారెవ్వరకు ఆ తోరణాలు కనిపించలేదు. ఆయన అక్కడున్న వాళ్ళతో "ఇక్కడో రాజాధి రాజు ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతకండి" అన్నారు. వాళ్ళు గండి మొత్తం గాలించి ఎవరు లేరని తేల్చారు కానీ, థోమస్ మన్రో గారు మాత్రం అక్కడే విడిది చేసి చాల రోజులు ఉన్నారు. గండిలో నున్న శ్రీ ఆంజనేయ స్వామి బొమ్మ ఈ బంగారు తోరానికి కారణం అని భావించి అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. కానీ అక్కడకు కొన్ని గజాల దూరంలో నున్న వీరన్న గట్టు పల్లి నుండి ప్రసరించిన దివ్య కిరణాలే ఆ బంగారపు తోరణాలు. అవి యోగి వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చినవి కావచ్చు, ఆయన ఆత్మ స్వరూపం నుండి వచ్చినవి కావచ్చు. విచిత్రం ఏమిటంటే, ఈ బంగారు తోరణాలు కనిపించిన ఆరు నెలల్లో మన్రో గారు చనిపోయారు. పాములకు, సిద్దులకు తెలిసి కానీ తెలియకకాని కష్టం కలిగితే ఫలితం వేరుగా ఉంటుంది అని లోకంలో నానుడి. తన జన్మస్థలాన్ని మంది మార్బలంతో ఆణువణువూ పరిశీలించడం ఆ మహా యోగికి బహుశ నచ్చివుండలేదేమో.

ఈయన యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించారు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందారు.

వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది. వేమన రసవాది అని స్వర్ణవిద్య కోసం గురువులకై వెతికారని ఐతిహ్యం ఉంది.

వేమన పద్యాలలో అతని జీవితం

వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదహరిస్తారు.

నందన సంవత్సరమున; పొందుగ కార్తీకమందు బున్నమినాడీ
వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడెరా వేమా!

ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి; మూగచింతపల్లె మొదటి యిల్లు
ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు; విశ్వదాభిరామ వినురవేమ!

కాదనడెవ్వరితోడను; వాదాడగబోడు వెర్రివానివిధమునన్
భేదాభేద మెరుంగును; వేదాంత రహస్యములను వేమన నుడువున్ ||

 

కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవేది జలాన్ని సంగ్రహించారు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణునినుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యారు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నారు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టారు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యారు.

యవ్వనంలో వేమన వేశ్యాలోలుడై తిరిగేవారు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడిని వలె ఆభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని, అన్ని నగలు సాధించుకొని, తుదకు అతని వదినగారి ముక్కు బులాకీ తెమ్మని అడిగింది. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన బులాకీ ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్ఛమైన శారీరిక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించారు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లారు.

తరువాత వ్యవసాయం చేయసాగారు. ఎవరికీ పనికిమాలిన వెర్రిపుచ్చకాయలు సాగుచేసి కూలిగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నారు. అతిపేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసికెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయట. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యారు.

వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పారు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందారు.

పరిశోధనాత్మక జీవిత చిత్రం

త్రిపురనేని వెంకటేశ్వరరావు అభిప్రాయం ప్రకారం వేమన జీవితం గురించిన ఊహాచిత్రం ఇలా ఉంది.

వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయు. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగారు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు.  పద్దులు వ్రాయగలరు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు.

కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డారు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటారు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది.

ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును.

అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనారు. దాని గురించి మరల మరల ప్రస్తావించారు. అతని ఎందరో యోగులను, గురువులను దర్శించారు. వారు చెప్పిన సాధనలు చేశారు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నారు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నారు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించారు.

వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించారు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగారు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నారు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించారు.

ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించారు. గురువుల కపటత్వాన్ని నిరసించారు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక వైఎస్ఆర్ జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్ద) మహాసమాధి చెందారు.

పద్యాలు

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు.

   అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
          సజ్జనుండు పలుకు చల్లగాను
          కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
           విశ్వదాభిరామ వినురవేమ.

మృగము మృగమనుచును మృగమును దూషింత్రు
మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును
మృగముకున్న గుణము మూర్ఖునకేదయా?
విశ్వదాభిరామ వినురవేమ!

హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడు గాడు మొరకు జనుడె గాని
పరిమళములు గార్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభి రామ వినురవేమ!

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుండు కాడు
కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

అంతరంగమందు నపరాధములు సేసి
మంచివాని వలెనె మనుజుడుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ!

                                     తొలి తెలుగు రామాయణ గ్రంధకర్త మన గోనబుద్దా రెడ్డి

గోన బుద్దారెడ్డి సుప్రసిద్ధ తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూరు రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు.

ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో క్రీ.శ.1294-1300 కులంలో రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.

ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు. గోనబుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు తిక్కన రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణం కాదు

కుటుంబ నేపథ్యo

కాకతీయుల సైన్యంలో సేవలందించే ఉన్నతోద్యోగాలకు చెందిన కుటుంబంలోనివారు గోన గన్నారెడ్డి వంశస్థులు. బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం అనుసరించి ఆయన పూర్వీకుల విశేషాలు తెలుసుకోవచ్చు. బుద్ధారెడ్డి తండ్రి పేరు విట్ఠలభూపతి (లేదా విట్ఠలరెడ్డి). ఆయన తండ్రి పేరు కూడా బుద్ధారెడ్డియే. బుద్దారెడ్డి ముత్తాత పేరు గోన రుద్రభూపతి. రుద్రభూపతి తండ్రి గోన కాటరెడ్డి.

జీవిత విశేషాలు

కాకతీయ రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్థమానపురం (నేటి వడ్డెమాన్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోనబుద్దారెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గోన గన్నారెడ్డి వర్థమానపురం రాజధానిగా పాలించాడు.ఇతని తర్వాత గోన బుద్దారెడ్డి అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోనబుద్దారెడ్డి కూతురు కుప్పాంబిక గుండేశ్వరాలయం నిర్మించింద. ఈమె తొలి తెలుగు కవియిత్రిగా ఖ్యాతి చెందింది.

సాహిత్యం

గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి సంపూర్ణ రామాయణంగా సుప్రఖ్యాతి చెందినది. అంతకుమునుపు తిక్కన వ్రాసిన నిర్వచనోత్తర రామాయణం సంపూర్ణమైన రామాయణంగా చెప్పేందుకు వీలులేని రచన. రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. తెలుగులో ద్విపద ఛందస్సును ఉపయోగించి ప్రధానమైన కావ్యాన్ని రచించడంలో పాల్కురికి సోమనాథుని తర్వాత రెండవవారిగా బుద్ధారెడ్డి నిలుస్తున్నారు. మరియు చాల తెలివి గల వ్యక్తి .

                                              అపర దానకర్ణుడు బుడ్డా వెంగళ రెడ్డి

బుడ్డా వెంగళరెడ్డి (జనవరి 1, 1840 - డిసెంబరు 31, 1900) 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.

వీరు కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి మరియు వెంకటమ్మ దంపతులను జన్మించాడు. ఇతడు పెద్దగా చదవకపోయినా తల్లినుండి దానగుణాన్ని దాని గొప్పదనాన్ని తెలుసుకున్నాడు.

రెడ్డిగారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఒక్క భార్యకు కూడా సంతానం కలుగలేదు. అందువలన తన తమ్ముని కుమారుని దత్తత తూసుకున్నాడు.

1866 కాలంలో వీరి కీర్తి ప్రతిష్టలు విన్న పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తండోపతండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డిగారిని ఆశ్రయించారు. వారి దీనస్థితిని అర్ధంచేసుకున్న రెడ్డిగారి ఇంట్లో ఉన్న ఆరు పుట్ల ధాన్యాన్ని గంజి కాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు.

పూటకు ఎనిమిది వేలకు తక్కువ కాకుండా తిండి పెట్టారని అంచనా. వంటమనిషి గంగన్న ఆకాలంలో చేసిన సేవలకు మెచ్చిన రెడ్డిగారు అతనికొక బంగారు కడియం తొడిగి సత్కరించారు. అనంతర కాలంలో స్వగ్రామంలో పాఠశాలను నెలకొల్పి శివరామశాస్త్రి అనే పండితుని కుటుంబాన్ని పోషిస్తూ విద్యాదానం చేశారు.

ఈయన సేవలను గుర్తించి అప్పటి మద్రాసు ప్రభుత్వం విక్టోరియా బంగారు పతకాన్ని బహూకరించింది. ప్రభుత్వం ఈయన్ను ప్రొవిన్సియల్ జ్యూరీ యొక్క సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి గౌరవించింది.

ఈ సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. ఆ బంగారు పతకముపై క్రింది విధంగా చెక్కబడినది. "1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు, నిరాధారముగా నుండిన, తన స్వదేశస్థుల పట్ల జరిపించిన ఉత్కృష్ట ఔదార్యమునకు గాను, హర్ మైజెస్టి రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళరెడ్డిగారికి బహుమానమివ్వబడినది."

రెడ్డిగారు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.

మరణం

మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి గారు డిసెంబరు 31, 1900 తేదీన శివసాయుజ్యాన్ని పొందారు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం

ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిగారిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, "అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది" అన్నారు. కాని బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటె మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.

బ్రిటీషర్ల గుండెల్లో సింహ స్వప్నం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాళెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకడు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.

18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలెగాళ్ళుండేవారు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిషు వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిషు ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.

ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడు గా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు, నొస్సం జమీదారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దుచేసింది బ్రిటిషు ప్రభుత్వం.

నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి, ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాధల వలన తెలుస్తున్నది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.

నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరికాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమేదారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్నకూతురు. నరసింహా రెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొర సుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య వలన ఒక కూతురు, మూడవ భార్య వలన ఇద్దరు కుమారులు జన్మించారు.

తిరుగుబాటు ప్రారంభం

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసీల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.

1846 జూలై 10వ తేదీ రెడ్డి 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి,ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకున్నాడు.ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది.

తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధించింది.

వీరమరణం

నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో ఔకు రాజు తమ్ముడొకడు.

కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.

అభినవ కౌటిల్యుడు, విద్యావేత్త రచయిత మన  కట్టమంచి రామలింగారెడ్డి

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (డిసెంబర్ 10, 1880 - ఫిబ్రవరి 24, 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించాడు.

బాల్యం

రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో 1880 డిసెంబరు 10న జన్మించాడు. చిత్తూరు - తిరుపతి మార్గంలో ఇది ఒక చిన్న పల్లె. సుబ్రహ్మణ్యంరెడ్డి, నారాయణమ్మ దంపతులకు ఇతడు మూడో సంతానం. సుబ్రహ్మణ్యంరెడ్డి సోదరుడు పెద్దరామస్వామిరెడ్డి రామలింగారెడ్డిని దత్త పుత్రుడుగా స్వీకరించాడు.

చదువు, పురస్కారాలు

సి.ఆర్‌.రెడ్డి చదువు అతని అయిదో ఏట వీధి బడిలో మొదలయినది. చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర, బాల రామాయణాన్ని చదివేవాడు. 1890లో ప్రస్తుత పీసీఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు ఉన్నత పాఠశాలలో మొదటిఫారంలో చేరాడు. ప్రతి పరీక్షలోనూ ఉన్నత శ్రేణి సాధించేవాడు.

ఉన్నతాభ్యాసం కోసం మదరాసు వెళ్ళి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసాడు. 1899లో నవ్య కావ్యరచన పోటీలో, తన 19వ యేటనే ముసలమ్మ మరణము లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందాడు. 1902 లో బీ.ఏ. పరీక్షలో చరిత్రలో, తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందాడు. అతను ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త. ఎన్నో బహుమతులు అందుకొన్నాడు.

డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్పుతో ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు.

భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నాడు. 1903లో అతని తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1904లో 'విద్వాంసుడు' పురస్కారం అందుకున్నాడు. 1905 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై, అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలు ప్రశంసలు అందుకొన్నాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. 1906లో ఎం.ఏ. పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, హస్య చతురతలకు అక్కడివారు ఆశ్చర్యపడేవారట.

ఉద్యోగ జీవితం

బరోడా సంస్థానాదీశుడు శాయాజీరావు గైక్వాడ్ సి.ఆర్‌.రెడ్డి ప్రతిభను గుర్తించి, తన సంస్థానంలో విద్యాశాఖలో ఉద్యోగం ఇవ్వదలచి, అందుకోసం వివిధ విశ్వవిద్యాలయాలను సందర్శించడానికి అతనిని అమెరికా పంపాడు. అతని పర్యటన పూర్తయ్యాక 1908 లో స్వదేశానికి వచ్చి తన 28వ యేట బరోడా కళాశాలలో ఆచార్యునిగాను, ఉపాధ్యక్షునిగాను తన తొలి ఉద్యోగం ప్రారంభించాడు. విద్యా వ్యవస్థను మరింత అధ్యయనం చేయడానికి అమెరికా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాలలో కూడా పర్యటించాడు.

ఆ తర్వాత మైసూరు మహారాజా కళాశాలలో ఆచార్య పదవి స్వీకరించాడు. అక్కడ ఆచార్యునిగా, ప్రిన్సిపాల్‌ గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా, విద్యాశాఖాధికారిగా పలు బాధ్యతలు వెరవేర్చాడు. ఇక్కడ పనిచేసిన 12 సంవత్సరాల కాలంలో హరిజనులకు పాఠశాలలలో ప్రవేశం కల్పించడానికి కృషి చేశాడు. విద్యార్థులు అతనిని ఆచార్యునిగా అమితంగా గౌరవించేవారు. అతని ప్రణాళిక ఆధారంగా మైసూర్ విశ్వవిద్యాలయం 1916 లో ప్రారంభమయ్యింది. దానికి కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. తరువాత రెండేళ్ళకు మైసూర్ సంస్థానం విద్యాశాఖాధికారిగా నియమింపబడ్డాడు. ఆ హోదాలో "ప్రతి ఊరికి ఒక పాఠశాల" అనే ఉద్యమం ప్రారంభించాడు. 1921లో అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశాడు.

రాజకీయ జీవితం

1921 తరువాత రాజకీయాల్లో పాల్గొన్నాడు. 1922 లో ఒక స్థానానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచి శాసనసభలో ప్రవేశించాడు. ఆ తర్వాత 2వ సారి చిత్తూరునుండి అత్యధిక మెజారిటీతో గెలుపొందాడు. 1921-25 మధ్య కాలంలో మద్రాసు కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నాడు. జస్టిస్‌ పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆయన తర్వాత యునైటెడ్‌ నేషనలిస్టు పార్టీలో చేరి డిప్యూటీ లీడర్‌గా వ్యవహరించాడు. 1935 లో కాంగ్రెస్‌ తరఫున మద్రాసు కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 1936 లో కొంతకాలంపాటు చిత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా పనిచేశాడు. శాసన సభలో సి.ఆర్.రెడ్డి ప్రసంగాలు చాలా గొప్పగా ఉండేవి.

ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉపకులపతిగా

ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలని శాసన సభలో ఎన్నో ప్రసంగాలు చేశాడు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఆంధ్రా యూనివర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి (వైస్‌ ఛాన్సలర్‌) గా 1926 నుంచి విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. అయితే ప్రభుత్వం వారి దమననీతికి నిరసనగా తన ఉపకులపతి పదవికి రాజీనామా చేసి చిత్తూరు తిరిగి వచ్చేశాడు. తరువాతి ఉపకులపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విదేశాలకు వెళ్ళినప్పుడు రెండోసారి 1936 లో మళ్లీ అదే బాధ్యతను చేపట్టాడు. 1949 వరకు 14 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగాడు. 1949 లో మద్రాసు విశ్వవిద్యాలయం ప్రొ-ఛాన్సలర్‌ పదవిని స్వీకరించాడు.

సాహితీ సేవ

సాహిత్యరంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు కట్టమంచి దోహదపడ్డాడు. ఒకవైపు తెలుగు కవితను మరో వైపు కవితా విమర్శను నూతన శోభతో కొత్తకాంతులతో ఆవిష్కరించిన సాహితీమూర్తి. సంభాషణలతో దెబ్బకు దెబ్బ తీయగల నేర్పు, వాదనాచాతుర్యం ఆయన శైలి. హాస్య ప్రియత్వం, ఛలోక్తులు, చమత్కార సంభాషణా నైపుణ్యం వంటి లక్షణాలతో అందరినీ ఆకట్టుకునేవాడు.

ఆయన రచించిన ముసలమ్మ మరణం తొలి ముద్రణ 1900 లో జరిగింది. భారత అర్థశాస్త్రం, కవిత్వతత్త్వవిచారం, ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి, లఘుపీఠికా సముచ్చయం, వ్యాసమంజరి, పంచమి, వేమన మొదలయినవి తెలుగులో ఆయన రచనలు. డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు పేరుతో 1983 లో సంకలనాన్ని ప్రచురించారు. ఆంగ్లంలోను ఆయన చేయితిరిగిన రచయితే. డ్రామా ఇన్‌ద ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌, స్పీచస్‌ ఆన్‌ యూనివర్శిటీ రిఫార్మ్‌, డెమోక్రసీ ఇన్‌ కాంటెపరరీ ఇండియా.. ఆంగ్లంలో ఆయన రచనల్లో కొన్ని. విమర్శలో విప్లవము తెచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తి అని కీర్తి తెచ్చుకున్నాడు.

రచనలు

తెలుగులో

 • ముసలమ్మ మరణము - 1899లో ఆంధ్ర భాషాభిరంజని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900 లో అచ్చయ్యింది.
 • కవిత్వతత్త్వ విచారము - పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయం కావ్యం రెడ్డికి ఎంతో ఇష్టమైనది. ఆ ప్రబంధం గురించి తాను వ్రాసిన వ్యాసాన్ని తరువాత ఇంకా విస్తరించి "కవిత్వ తత్త్వ విచారము" అనే గ్రంథంగా వెలువరించాడు. ఇది తెలుగులో తొలి సాహిత్య విమర్శ గ్రంథం కావచ్చును. సాహితీ విమర్శలో క్రొత్త మార్గాలకు ఈ రచన మార్గదర్శి అయ్యింది.
 • భారత అర్థశాస్త్రం - కౌటిల్యుడి అర్ధశాస్త్రం ఆధారంగా చరిత్ర, సామాజిక అంశాలను అన్వయిస్తూ వ్రాసిన గ్రంథం.
 • ఆంధ్రసర్వకళాశాల విద్యాప్రవృత్తి
 • లఘుపీఠికా సముచ్చయం
 • వ్యాసమంజరి - వ్యాసాల సంపుటం - నవయామిని, భారత ప్రశంస, అంపకం వంటి ఖండ కావ్యాలు
 • పంచమి - వ్యాసాల సంపుటం
 • వేమన -
 • డా.సి.ఆర్‌.రెడ్డి పీఠికలు - 1983 సంకలనం
 • సరస్వతీ సామ్రాజ్యము - గ్రంథాలయోద్ధారక అయ్యంకి వేంకటరమణయ్య సన్మాన సభలో రామలింగారెడ్డి సంకలనం చేసి సమర్పించిన సంచిక
 • ముత్యాలసరములు
 • దేవీభాగవతము
 • ప్రహసనములు
 • ప్రతాపరుద్రీయము
 • కీ.శే.కట్టమంచి సుబ్రహ్మణ్యరెడ్డిగారి సంక్షేప చరితము
 • ఆధునిక సాహిత్య విమర్శ రీతులు

ఆంగ్లంలో

 • Drama in the East and West
 • Speeches on Universitry Reform
 • Democracy in contemporary India
 • Congress in Office
 • Education, Industry & Commerce

ఛలోక్తులు

సి.ఆర్.రెడ్డి ఛలోక్తులు, హాస్య చతురత, సమయస్ఫూర్తి చాలాచోట్ల ఉటంకించడం జరుగుతుంది. భాషలో శ్లేషను, భావాన్ని సందర్భానుసారంగా వాడడంలో అతను దిట్ట. అతిశయానికీ, ఆత్మ విశ్వాసానికీ, సంభాషణా చతురతతో ఇబ్బందికర పరిస్థితులలోంచి తప్పించుకోవడానికీ అతని మాటల నైపుణ్యం గొప్పగా ఉపయోగపడేది.

 • ఒకసారి పేరుమోసిన వక్తలు పాల్గొన్న, 8 గంటలు సాగిన, సైన్సు గురించిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో రెడ్డి జడ్జిగా వ్యవహరించాడు. చివరకు ఆయన అన్న మాటలు - ఈరోజు బోనులో ఉన్నది సైన్సు కాదు. నేను జడ్జినికాను. ఇంత సేపు పడుతుందని తెలియక న్యాయనిర్ణేతగా ఒప్పుకొన్నందున దోషినయ్యాను.
 • ఒకసారి మద్రాసు శాసనసభలో తన మిత్రుడైన పానగల్లు రాజాపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై తన పార్టీ ఆదేశానుసారం రెడ్డి గంటలతరబడి ఘాటుగా ఉపన్యసించాడు. అంతకుముందు ఆ రెడ్డే స్వయంగా తనను ప్రశంసించిన లేఖలు చూపబోయాడు. పానగల్లు రాజా. అందుకు రెడ్డి - "రాజాగారూ! విడాకుల సమయంలో భార్యాభర్తలు తమ పాత ప్రేమలేఖలు ఎవరివి వాఱికి ఇచ్చేయడం ధర్మం" అన్నాడు.
 • ఒక రాజకీయ సభలో ఆయనున్న వేదికపై రాళ్ళు రువ్వినపుడు - "మన జస్టిస్ పార్టీవారు రాజకీయాల్లో రాతియుగం ప్రవేశపెడుతున్నారు"
 • ఒకసారి ఆయన తన అల్లుడింటిముందు కారుదిగి 'కుక్కలున్నవి జాగ్రత్త' అన్న బోర్డు చూశాడు - "ఇచట ఇంతకు ముందు మనుషులుండేవారు. వారేమయ్యిరి?"
 • ఒకసారి తన ప్రసంగం మధ్యలో కరెంటు పోయినప్పుడు - "చీకట్లో మాట్లాడడం నాకు అలవాటు లేదు. బ్రహ్మచారిని గదా?"
 • శాసన సభ్యుల గురించి - "వీరిలో చాలామంది ముద్ద మింగుటకును, ఆవులించుటకును మాత్రమే నోరు తెరిచెదరు"
 • ఈనాటి యువత సలహా తీసుకోవడం కంటే ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు
 • మనం పేదవాళ్ళం కావచ్చును. కాని బిచ్చగాళ్ళం కానక్కరలేదు.

కొన్ని ఛలోక్తులు వాటి వాడి తరుగకుండా తెలుగులోకి అనువదించడం కష్టం.

 • 'If man cannot find a satisfactory axiom, he invents a hypothesis'.
 • 'We may be poor, but we need not be paupers'.
 • 'Applied science is Herculean power'.
 • 'Will without reason, reason without will, either is an unhappy combination. The two must go together balancing each other'.
 • 'Government and parties are agreed in this, they prefer creatures to creators of ideas who are always a troublesome lot'.
 • 'Every form of government, especially democracy, rests on two foundations. The first is a strong character and the second a sane and balanced judgement'.
 • 'Brevity is the soul of curfew'.
 • 'Democracy is a means to an end. The end is not partisan party government. The end is good government'.

పదవులు

1926లో డాక్టర్ సి.ఆర్‌.రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యాక్షునిగా నియమితులయ్యాడు. ప్రభుత్వ దమన నీతికి నిరసనగా 1930 లో రాజీనామా చేశాడు. 1936 లో ప్రభుత్వం మళ్లీ ఆయనకు ఆ పదవిని అప్పగించింది.

                                         తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం.

తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.

నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు . జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.

సురవరం ప్రతాపరెడ్డి - జీవిత విశేషాలు

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. 1926లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.

తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు.

1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా ఆయన జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు. 1953 ఆగష్టు 25న ఆయన దివంగతుడైనాడు.

రచనా వ్యాసంగం

సురవరం రచించిన గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 కవుల వివరాలున్నాయి. ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు. రాజకీయ సాంఘీక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి.

రాజకీయాలు

సురవరానికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోయిననూ సన్నిహితుల ప్రోద్బలంతో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ప్రముఖ న్యాయవాది వి.రామచంద్రారెడ్డి పై విజయం సాధించి హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. కాని ప్రారంభం నుంచి రాజకీయాలకు దూరంగా ఉండటం, గ్రూపు రాజకీయాలు చేయకపోవడంతో జిల్లా వ్యక్తి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్ననూ ఇతనికి మంత్రిపదవి కూడా లభించలేదు. ఈ విషయంపై సురవరం స్వయంగా ఆయన ఆప్తుడైన రంగాచార్యులకు లేఖ వ్రాస్తూ "ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నా వంటివారు ఏమియును పనికి రారు" అని స్పష్టంగా పేర్కొన్నాడు.

విశేషాలు

1926లో తెలంగాణలో తెలుగు భాషా వికాసానికి దోహదపడే విధంగా ‘గోల్కొండ పత్రిక’ను తీసుకొచ్చారు. అప్పుడు రాజభాషగా,పాలనా భాషగా,వ్యవహారభాషగా ఉర్దూ ఉన్నది.అప్పటి రాజభాష ఉర్దూ భాషలోనే మీజాన్, జామీన్, రయ్యత్ పత్రికలు వచ్చేవి.అప్పటికి రెండు తెలుగు వార పత్రికలు మాత్రమే ‘నీలగిరి’నల్లగొండ జిల్లా నుండి,‘తెలుగు’ వరంగల్ జిల్లా నుంచి వెలువడుతుండేవి.

1930లో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ‘ఆంధ్ర మహాసభ’కు అధ్యక్షత వహించారు.ఆంధ్ర మహాసభ కార్యాకలాపాలన్ని తెలుగులోనే జరగాలంటూ తీర్మానం చేయించారు.
తెలంగాణలో కవులే లేరన్న ముడంబ వెంకట రాఘవాచార్యుల ప్రశ్నకు సమాధానంగా ‘గోల్కొండ పత్రిక’ ద్వారా 354 మంది తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాల ను సేకరించి ‘గోల్కొండ కవుల సంచిక’ పేరుతో వెలువరించారు.
జీవిత చరిత్ర

శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని, వారి సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని, రాజకీయ, సాంఫిుక, సాహిత్య సేవ, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ సామాజికోద్యమాలను, వంశచరిత్రనూ, వారి జీవిత సంగ్రహాన్ని, అంతరంగాన్నీ, విద్యాభ్యాసం, బహుభాషా పాండిత్యం, కవితా నైపుణి, పత్రికా రచన వ్యాసంగం, కవి పండిత మైత్రి, పత్రికా సంపాదకునిగా, వివిధ వ్యాసరచయితగా, గోలకొండ పత్రిక ఆవిర్భావం, తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని డా. ఇందుర్తి ప్రభాకర్ రావు గారు పరిశోధించి, పరిశ్రమించి "శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన" అనే గ్రంథం రచించారు. శ్రీ సురవరం గారి చరిత్రను అధ్యయనం చేయదలచిన భావి తరాలు తప్పకుండా చదవాల్సిన చారిత్రాత్మక గ్రంథం. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంవత్సరం 2014 లో తెలంగాణ వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి స్మారకార్థం నిర్వహించిన సభలో ఈ గ్రంథం ఆవిష్కృతమైంది.

                                         తొలితెలుగు టాకీ దర్శకుడు  హెచ్.ఎమ్.రెడ్డి 

తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’, తొలి తమిళ టాకీ చిత్రం కాళిదాసు తీసినవారు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఆయన పూర్తిపేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. హెచ్.ఎమ్.రెడ్డి బెంగుళూరులో పుట్టి పెరిగి, అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాడు. బెంగుళూరులో పోలీసుగా పనిచేశాడు.

ఆయన హైదరాబాదు జాగీర్దార్‌ కాలేజీలో ఇంగ్లీషు టీచరుగా పనిచేసేవారు. 1927లో ప్లేగువ్యాధి ప్రబలినపుడు చాలా కుటుంబాల వలెనే వూరువిడచి బొంబాయి వెళ్ళారు. తన బావమరిది హెచ్‌.వి.బాబు అండలో సినిమా రంగంలో ప్రవేశించారు. అక్కడక్కడా వేషాలు వేస్తూ సినిమా టెక్నిక్‌ను కొంతవరకూ అర్థం చేసుకున్నారు.

1930లో ఇంపీరియల్‌ కంపెనీకి ‘విజయకుమార్‌’, 1931లో ‘ఎ వేజర్‌ ఇన్‌ లవ్‌’ అన్న రెండు మూకీలను హెచ్.ఎమ్.రెడ్డి డైరెక్ట్‌ చేశారు. రెండు చిత్రాల్లోనూ పృథ్వీరాజ్‌ కపూర్‌ ముఖ్యపాత్రధారి. అలా - శబ్దరహిత చిత్రాలు తీసి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, 1931లో శబ్దసహిత చిత్రాలు తీశారు. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక ‘భక్తప్రహ్లాద’ని ఆయనకు అప్పజెప్పారు. అలాగే ‘కాళిదాసు’ కూడా తమిళంలో తీశారు రెడ్డి.

హిందీ, తెలుగు, తమిళం మూడు భాషల చిత్రాలూ 1931 లోనే విడుదలైనాయి. ‘ఆలం ఆరా’ మార్చి 14న విడుదలైంది. ‘భక్త ప్రహ్లాద’ సెప్టెంబరు 15న విడుదలయ్యింది. అలా హెచ్‌.ఎమ్‌.రెడ్డి టాకీయుగానికి నాంది పలికి, ‘పితామహుడు’అనిపించుకున్నారు.

రెడ్డిగారిని ‘టైగర్‌’ అనేవారు. మీసం మీద చెయ్యి వేసి ఈ పక్కా ఆ పక్కా దువ్వి ‘ఇది తమిళం ఇది తెలుగు’ అని దర్జాగా, గర్వంగా చెప్పుకోగల ఘనుడు హెచ్‌.ఎమ్‌.రెడ్డి. తర్వాత ‘సీతాస్వయంవరం’ (1933) చిత్రం హిందీలో తీశారు. రెడ్డి కొల్హాపూర్‌లో వున్నప్పుడు పారుపల్లి శేషయ్య, కూరుకూరు సుబ్బారావు ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ (1936) తియ్యాలని, ఆయన సహాయం కోరారు.

హెచ్‌.వి. బాబు చేత ఆయన దర్శకత్వం చేయించి - తాను పర్యవేక్షణ చేసి పూర్తి చేయించారు. ఆ చిత్రం విజయవంతమైంది. గూడవల్లి రామబ్రహ్మం ఈ సినిమాకి ప్రొడక్షన్‌ మేనేజరుగా సినిమా రంగప్రవేశం చేశారు. అంతకుముందు రెడ్డిగారు తీసిన ‘ప్రహ్లాద’ నుంచి కొన్ని చిత్రాల వరకు ఎల్.వి.ప్రసాద్ సహాయకుడుగా పనిచేశారు.

రోహిణి పిక్చర్స్‌ పేరిట బి.ఎన్.రెడ్డి లాంటి వారిని కలుపుకుని ‘గృహలక్ష్మి’ (1938) తీసి ‘సాంఘిక పతాకం’ ఎగరవేశారు రెడ్డి. రోహిణి స్థిరపడింది, భాగస్వాములు విడిపోయి ‘వాహిని పిక్చర్స్’ స్థాపిస్తే అదీ స్థిరపడింది. రెడ్డిగారు ‘నిర్దోషి’ (1951) తీసిన తర్వాత రోహిణి స్టూడియో కట్టారు మద్రాసులో. ప్రయోగాలు చెయ్యడంలో కూడా హెచ్‌.ఎమ్‌.దిట్ట. అంతవరకూ విలన్‌ వేషాలే వేస్తున్న ముక్కామలని ‘నిర్దోషి’లో హీరోని చేశారు. వాంప్‌ వేషాలు ఎక్కువగా వేసిన అంజలీదేవిని నిర్దోషి (1951) తో హీరోయిన్‌ని చేశారు. ‘నిర్దోషి’లో ఓ చిన్నవేషంలో కనిపించిన కాంతారావుని ‘ప్రతిజ్ఞ’తో హీరోని చేశారు. అలాగే ‘ప్రతిజ్ఞ’లో విలన్‌ రాజనాలకు అదే తొలిచిత్రం.

కమలాకర కామేశ్వరరావు, సదాశివబ్రహ్మం, కొండముది గోపాలరాయశర్మ, మల్లాది వెంకటకృష్ణశర్మ, కొవ్వలి, భమిడిపాటి కామేశ్వరరావు, శ్రీశ్రీ - ఇలా ఎందరో మహామహులను వెండితెరకు పరిచయంచేసిన ఘనులు హెచ్.ఎమ్.రెడ్డి.

ఆంధ్ర కంబర్‌ పూతలపట్టు శ్రీరాములురెడ్డి

ఆంధ్ర కంబర్‌గా ప్రసిద్ధి చెందిన పూతలపట్టు శ్రీరాములురెడ్డి (ఏప్రిల్ 5, 1892 - నవంబర్ 8, 1971) ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు.

జీవిత

ఈయన 5 ఏప్రిల్ 1892లో లక్ష్మమ్మ, పెద్దబుచ్చిరెడ్డి దంపతులకు చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామంలో జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకొన్నాడు. తరువాత స్వయంకృషితో ఆంధ్ర, తమిళ, సంస్కృత సాహిత్యాలు చదువుకున్నాడు. ఇతని తండ్రి హరికథలను చెప్పేవాడు.

మద్రాసు విశ్వవిద్యాలయం నిర్వహించిన విద్వత్ పరీక్షలోఉత్తీర్ణులై తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్ర్రారంభించాడు.  విద్యాబోధన చేస్తూ రచనా వ్యాసంగాన్ని సాగించాడు. బమ్మెర పోతన వలెనే భక్తిరస ప్రధానమైన రచనలపై మొగ్గుచూపాడు. తమిళంలో ప్రసిద్ధిచెందిన కంబ రామాయణం, తిరుక్కురళ్, శాండియార్, శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలు తెలుగులోకి అనువాదం చేసి కవిపండితుల మెప్పు పొందాడు. ఇవికాక కుమార సంభవం కావ్యాన్ని తెలుగుసేతను గావించాడు. తెలుగు సందేశం, నీతి నిధి, సుభాషిత భండారం, చిత్తూరు మండల ప్రశస్తి మొదలైన ఇరవై పద్యకావ్యాలు రచించారు. వీరు 8 వరకు గద్య రచనలు కూడా చేశారు. వానిలో సుజ్ఞాన బోధిని, సురాభాండేశ్వరం, విశ్వామిత్ర చరిత్రం, బాల వినోదిని గ్రంథాలు ప్రముఖమైనవి. వీటిలో సంతృప్తిచెందక, ఆంధ్ర భాషా లక్షణ లక్షణం, తెలుగు లక్షణం (3 భాగాలు) నిర్మాణ కలనం (3 భాగాలు), విద్యార్థి కోశం వంటి లక్షణ గ్రంథాలను కూడా రచించి లాక్షణికులుగా ప్రసిద్ధిపొందాడు.

ఇతడు 8 నవంబర్ 1971 తేదీన మాణించాడు.

వేలాదిమంది శిష్యులు, మిత్రులు, బంధువులు, అభిమానులు కలసి ఇతని సేవలకు గుర్తింపుగా వీరి కాంస్యవిగ్రహాన్ని పూతలపట్టు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు.

బిరుదులు

 1. విద్వత్కవికులతిలక
 2. సాహిత్య రత్నాకర
 3. కవితాతపస్వి
 4. అభినవ పోతనామాత్య
 5. మహాకవి
 6. ఆంధ్ర కంబర్

సత్కారాలు, పదవులు

 • పూతలపట్టు గ్రామ ప్రజలచే పల్లకీ ఊరేగింపు
 • ఆంధ్ర నలంద గుడివాడ వారిచే బంగారు పతకం
 • తమిళనాడు కారక్కుడిలో జరిగిన కంబకవి వార్షికోత్సవంలో కనకాభిషేకం
 • ఆంధ్ర కళాపరిషత్ అధ్యక్షుడు 1953లో
 • సెనేట్ సభ్యుడు - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి.
 • సభ్యుడు - ఆంధ్ర సాహిత్య అకాడెమీ, హైదరాబాదు
 • రాష్ట్రపతిచే మంజూరైన గౌరవ వేతనం మరణించేదాకా.

రచనలు

 • అభిదాన దర్పణము
 1. కంబరామాయణం (2 సంపుటాలు) (తమిళం నుండి అనువాదం)
 2. నాలడియారు (తమిళం నుండి అనువాదం)
 3. పెరియ పురాణము (తమిళం నుండి అనువాదం)
 4. శిలప్పదికారము (అందియకత) (తమిళం నుండి అనువాదం)
 5. మణిమేఖల (తమిళం నుండి అనువాదం)
 6. సూక్తిసుధ
 7. తెనుగు సందేశము
 8. త్రివర్గము
 9. నీతిగుచ్చము
 10. కుమారసంభవము (సంస్కృతం నుండి అనువాదం)
 11. ప్రశ్నోత్తర రత్నావళి (సంస్కృతం నుండి అనువాదం)
 12. సురాభాండేశ్వరము (1953)  ఇది చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకాలో కలకడ గ్రామంలో వెలసిన సురాభాండేశ్వరుడు గురించిన స్థలపురాణం.
 13. భక్తిమాల (పెద్దపురాణము)
 14. మధురకవితా సంహిత
 15. త్రికటుకము

కవి, విమర్శకులు 'కవి కోకిల' దువ్వూరి రామిరెడ్డి

ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.

కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారాయన.

దువ్వూరి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మచ్చుకు ఒక్క రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు. మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధలను చేస్తాయి. కళ్ళను అక్షరాల వెంట పరుగులెత్తిస్తాయి. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నాటుకునేటట్టు చెప్పడం వల్ల దుద్వూరి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మకథోరణిని రేకెత్తించాయి.

కవి, విమర్శకులుగానే కాకుండా న్యాయవాదిగా, నాటక రచయితగా, 'చిత్ర నళీయం' చలనచిత్ర సృష్టికర్తగా బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరి పేరు సాహితీ పుటల్లో శాశ్వతస్థానం సంపాదించుకుంది. బహుభాషా కోవిదునిగా సంప్రదాయ రీతులను మిళితం చేసి కొత్తతరానికి సాహితీ బాటలు వేసిన దువ్వూరి, ఆధునికాంధ్ర కవుల్లో దవ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆ మహనీయుని జీవనరేఖలను మళ్ళీ ఓసారి స్పృశించి తరిద్దాం.

జీవిత విశేషాలు

దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895 -- సెప్టెంబర్ 11, 1947) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు.

రచనలు

 • వన కుమారి
 • కృషీవలుడు (1924) - వ్యవసాయదారుని గురించిన పద్యకావ్యం.
 • పానశాల (1926) - ఉమర్ ఖయ్యామ్ రచించిన రుబాయిత్‌కు స్వేచ్ఛాతెలుగు సేత. ఇది దువ్వూరి రామిరెడ్డి రచనలన్నింటిలోను ప్రసిద్ధము.
 • రసిక జనానందము (ప్రబంధం)
 • స్వప్నాశ్లేషము (ప్రబంధం)
 • అహల్యానురాగాలు (ప్రబంధం)
 • కృష్ణరాయబారము (ప్రబంధం)
 • నలజారమ్మ (కావ్యం)
 • కర్షక విలాసం (నాటకం)
 • మాతృశతకం
 • జలదాంగన (నాటకం)
 • యువక స్వప్నము (నాటకం)
 • కడపటి వీడికోలు (నాటకం)
 • సీతా వనవాసం (నాటకం)
 • కుంభరాణా మాధవ విజయం (నాటకం)
 • నక్షత్రమాల
 • నైవేద్యము
 • కవిత్వతత్త్వ నిరూపణము

రచనలనుండి ఉదాహరణలు

గనిమల తుంగకున్ గఱికకాడల కల్లిన సాలెగూళ్ళ స
న్నని పటికంపుమంచు పడి నాణెపు ముత్తెసరాల పోలికం
గనుగొన రమ్యమయ్యె రవికాంతుల దేలుచు, నిట్టి భావమో
హనపు నిసర్గశిల్పముల, హాలిక, త్రొక్కక దాటిపొమ్మికన్ . -- (కృషీవలుడు)

అంతము లేని యీ భువనమంత పురాతన పాంధశాల, వి
శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా
క్రాంతలు పాదుషాలు, బహురామ్ జమిషీడులు వేనవేలుగా
గొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటొసంగుచున్ -- (పానశాల)

గతము గతంబె యెన్నటికి కన్నులగట్టదు, సంశయాంధ సం
వృతము భవిష్యదర్ధము, వివేకవతీ! ఒక వర్తమానమే
సతతమవశ్యభోగ్యమగు సంపద, రమ్ము విషాదపాత్రకీ
మతమున తావులేదు క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్ -- (పానశాల)

సినిమారంగం

ఇతడు 1936లో సతీతులసి చిత్రానికి రచయితగా సినిమారంగ ప్రవేశం చేశాడు. చిత్రనళీయం సినిమాకు రచనతోపాటు దర్శకత్వం కూడా చేపట్టి సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి అనే ఘనతను సాధించాడు. తరువాత తిరుపతి వేంకటేశ్వర మాహాత్మ్యం, పార్వతీ పరిణయము చిత్రాలకు కొన్ని పాటలను, పద్యాలను వ్రాశాడు. చివరగా సీతారామ జననం సినిమాకు మాటలను సమకూర్చాడు.

సన్మానాలు

 • 1929లో విజయవాడ ఆంధ్రమహాసభ ద్వారా కవికోకిల బిరుదు ప్రధానం
 • 1917లో, అనగా ఇతని 22వ యేటనే, సి.ఆర్. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో స్వర్ణపతకం బహూకరించారు
 • 1918లో ఇతని కావ్యం "వనకుమారి", విజయనగరం మహారాజు ఆస్థానంలోని కావ్యస్పర్ధలో ప్రధమ స్థానం పొందింది.

ప్రముఖ ఆర్ధికవేత్త, పద్మవిభూషణ్ మన యాగా వేణుగోపాలరెడ్డి

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నరైన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది.

వ్యక్తిగత వివరాలు

1941 ఆగస్టు 17న వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం కొమ్మనవారిపల్లె గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించాడు. నంద్యాల కలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశాడు. ఆయన వృత్తిరీత్యా మద్రాసులో స్థిరపడడం వల్ల వేణుగోపాల్‌రెడ్డి చదువంతా తమిళనాడులోనే సాగింది.

వృత్తి జీవితం

వేణుగోపాల్‌రెడ్డి IAS అధికారి కాకముందు 1961 నుంచి లెక్చరర్ గా పనిచేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో M.A., ఉస్మానియా విశ్వవిద్యాలయంలో Ph.D., నెదర్లాండ్స్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషియల్ స్టడీస్ లో ఆర్థిక ప్రణాళిక (Economic Planning) లో డిప్లొమా చేశాడు. అవే కాకుండా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (Doctor of Letters), మారిషస్ విశ్వవిద్యాలయం (Doctor of Civil Law) ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.

ఉస్మానియా విశ్వవిద్యాలయం (Department of Business Management) లోను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (London School of Economics and Political Science - International Relations Department) లోనూ, Administrative Staff College of India లోనూ విజిటింగ్ ఫాకల్టీగా పనిచేసిన వై.వి.రెడ్డి హైదరాబాదులోని CESS (Center for Economic and Social Studies) లో Honorary Senior Fellow గా కొనసాగుతున్నాడు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో (బ్యాంకింగ్) కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శి గా, వాణిజ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా, ఆపైన 1996 నుంచి ఏడేళ్ళు రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా సేవలందించాడు.

రిజర్వ్ బ్యాంకు గవర్నరు కాకముందు ప్రపంచ బ్యాంకు సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) బోర్డులో భారతదేశం తరపున ద్రవ్య వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన రెడ్డి 2002లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా నియమితుడయ్యాడు. ఆర్థికాభివృద్ధి పథంలో ఈయన సలహాలను వినియోగించుకున్న దేశాల్లో చైనా, బహ్రెయిన్, ఇథియోపియా, టాంజానియా, తదితర దేశాలున్నాయి.

ఆర్థికరంగ సంస్కరణలు, వాణిజ్యం, BoP (Balance of payments) మరియు ద్రవ్య మార్పిడి రేటు, విదేశీ వాణిజ్య ఋణాలు, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, ప్రాంతీయ ప్రణాళిక, ప్రభుత్వరంగ సంస్కరణలు, తదితర రంగాలలో ఆయన కీలక భూమిక నిర్వహించాడు.

రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా బ్యాంకు వ్యవహారాల్లో పారదర్శకతను తీసుకువచ్చాడు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం వృద్ధి రేటు నుంచి 8-9 శాతం వృద్ధిరేటును నమోదు చేసే స్థాయికి విస్తరించిన తరుణంలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా జాగ్రత్త వహించాడు. ద్రవ్యోల్బణాన్ని అదుపుచెయ్యడంలో గట్టిపట్టున రెడ్డి ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయంగా రూపాయి మారకం రేటు పెరిగేలా చేయడంలో సఫలీకృతుడయ్యాడు.

సెప్టెంబర్ 2008లో రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పదవీ విరమణ చేసిన వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థికమాంద్యం నుంచి బయటపడటానికి పలు దేశాల ప్రతినిధులు, ఎంతో అనుభవజ్ఞులైన ఆర్థిక బ్యాంకింగ్‌ నిపుణులతో ఐరాస ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. ఈ కమిటీ ఇప్పటికే ప్రాథమిక సిఫార్సులు చేసింది.

వై.వి.రెడ్డి ప్రస్తుత ఆర్థిక సంక్షోభంపై రాసిన పుస్తకం: 'ఇండియా అండ్‌ ద గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ క్రైసిస్‌'. ఈ పుస్తకంలో రెండు ప్రధానమైన అంశాలకు సమాధానం ఉంది. ఒకటి- మిగిలిన దేశాల కంటే భారత్‌ పరిస్థితి ఎందుకు మెరుగ్గా ఉంది. రెండు- ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చింది? దానిపై ఎవరేం చేస్తున్నారు? సంక్షోభాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకంలోని సమాచారం వీలు కల్పిస్తోంది.

ప్రస్తుతం వీరు 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా ఉనన్నారు. భారత ఆర్థిక రంగానికి వీరు చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం వీరిని పద్మ విభూషణ్ సత్కారం ఇచ్చింది.

వీరతెలంగాణ’ వాది మన రావి నారాయణరెడ్డి

రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.

జననం

నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో 1908, జూన్ 5న భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు.

విద్యార్థి దశలో

రావి నారాయణరెడ్డి తొలిదశలో ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితమైనారు. నిజాం పరిపాలనలో తెలంగాణాలో రాజకీయ చైతన్యం లేని స్థితిలోనే ఆయన పోరాటాన్ని ప్రారంభించారు.

రెడ్డి హాస్టల్ విద్యార్థిగా ఉండగానే అప్పటి నిజాం కళాశాల విద్యార్థి అయిన బద్దం యెల్లారెడ్డితో కలసి 1930 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో కాకినాడ వెళ్లి మరీ పాల్గొన్నారు. 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు.

రెండు వసతి గృహాలను నిర్వహించారు. 1930లో బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మా గాంధీని అరెస్టు చేయగా, దానికి నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటీష్ అధికారిగా వ్యవహరించే బ్రిటీష్ రెసిడెంట్ గూఢచారుల ద్వారా తెలుసుకుని, వారి ఇంటికి కొత్వాల్ రాజబహదూర్ వెంకట రామారెడ్డిని పిలిపించి రావి నారాయణరెడ్డిని హెచ్చరించవలసిందిగా సూచించారు.

 పాతికేళ్ళ ప్రాయంలోపుగానే దేశభక్తి, రాజకీయ పోరాటం పట్ల పట్టుదల వంటివి ఏర్పరుచుకున్నారు. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి పాదయాత్రగా ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేస్తూ హైదరాబాద్ నుంచి దేవరకొండ చేరుకున్నారు. మహాసభల్లో చురుకైన పాత్ర వహించారు.

నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైనది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా నిరూపించిన ప్రజాస్వామికవాది ‘రావి’.

1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌పై పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పనిచేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐ లో చాలాకాలం పనిచేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసాడు.

జాతీయోద్యమం బలంగా వేళ్లూను కున్న ప్రాంతాల్లో మాత్రమే కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంటుందని, అందుకు కారణం ఉద్యమంలో పాల్గొన్న అనుభవం వలన వాళ్లు కేవలం విడివిడి వృక్షాలను కాక, మొత్తం అరణ్యాన్ని చూడగలరన్నది ఆయన విశ్వాసం. ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో క్రియా శీలంగా పాలుపంచుకొన్న అనుభవంతో రాటుదేలడం వల్లే తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలను కైవసం చేసుకోవడం సాధ్యమైందని ఆయన తరచు అంటుండేవారు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. భువనగిరి సమావేశాల్లోనే ఆంధ్రమహాసభ అతివాద, మితవాద శిబిరాలుగా చీలిపోయింది.

దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన రావి నారాయణరెడ్డి 1947 తరువాతి కాలంలో పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను, సమ సమాజ ఆకాంక్షలతో కలగాపులగం చేయడం వల్లే 1948 ఫిబ్రవరిలో పార్టీ పోరాటం కొనసాగించాలనే తప్పుడు నిర్ణయం తీసుకుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం.

 చరిత్ర ఆయన మార్గమే సరైనదని తీర్పు చెప్పడం విశేషం. కాళోజీ నారాయణరావు ప్రవచించిన ‘వేరు తెలంగాణ’ను తాత్వికంగా వ్యతిరేకించడంతో ఆగక తాను ఎన్నటికీ ‘వీరతెలంగాణ’ వాదిగానే ఉంటానని చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ రావి నారాయణరెడ్డి. తన స్వంత భూమిని 200 ఎకరాలు దానం చేశారు.

 1. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసారు.
 2. 1941, 1943 సంవత్సరాల్లో భువనగిరిలో జరిగిన పదకొండవ, పన్నెండవ ఆంధ్ర మహాసభలకు వీరు అధ్యక్షత వహించి,ఆ సభను విజయవంతం చేశారు,
 3. మహాత్మాగాంధీ హైదరా బాద్‌కు వచ్చినప్పుడు తన భార్య సీతాదేవితో వెళ్ళి కలిసి తన భార్య ఒంటిపై ఉన్న నగల న్నింటినీ తీసి గాంధీగారి చేతిలో పెట్టి, హరిజన సేవక సంఘానికి ఇవ్వమని గాంధీజీని అభ్యర్థించారు.
 4. హైదరబాదు సాయుధ పోరాట సమయంలో తన స్వంత భూమి వందల ఎకరాల భూమిని రైతులకు పంచిన ఉదారవాది.
 5. నారాయణ రెడ్డి గారు తన 23 ఏళ్ల వయసులో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్య దర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు.
 6. 1952లో భారతదేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి నెహ్రూకన్నా అధిక ఓట్లతో గెలిచి పార్లమెంటరీ రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించారు.
 7. 1932లో తక్కర్ బాబా అఖిల భారత హరిజన సేవక్ సంఘ్‌ను స్థాపించాడు. హైదరాబాద్ విభాగానికి సరోజినీనాయుడును అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా రావి నారాయణరెడ్డిని నియమించారు.
 8. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను స్థాపించిన వారిలో రావి ముఖ్యులు. నిజాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై విధించిన నిషేధం ఎత్తేయాలని అక్టోబర్ 24న తొలిబ్యాచ్ సభ్యుడిగా సత్యాగ్రహం చేశారు.
 9. 1928లో ఆంధ్రమహాసభ ఏర్పడింది. 1941-44-45ల్లో మూడుసార్లు రావి అధ్యక్షునిగా పనిచేశారు. వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచారు. తమ పార్టీ సభ్యులు 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని గాంధేయవాది అయిన రావినారాయణరెడ్డి స్వీకరించారు. తనకు సంక్రమించిన భూమిలో 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టారు.
 10. రావి నారాయణరెడ్డి నాస్తికుడు . కుటుంబసభ్యులు మందిరానికి వెళ్తే కాదనని ప్రజాస్వామ్యవాది. రావి తన వివాహానంతరం ఒక విల్లు రాశారు. తాను మరణిస్తే తన భార్య వైధవ్య ప్రతీకలను ఆమోదించరాదని, కట్టూబొట్టులతో సలక్షణంగా ఉండాలని కోరారు! ఆమె తన అభీష్టానుసారం జీవించవచ్చనీ సవరించారు. భార్య మరణించిన అరవై ఏళ్లకు 1991 సెప్టెంబర్ 7న రావి మరణించారు. తన అస్తికలను గంగానదిలో కలపవద్దని పొలంలో చల్లితే చాలని అన్నారు. ఆ మేరకు వారసులు పచ్చని పొలాల్లో రావి ‘విభూది’ని చల్లారు.

                                                             ఉత్తమ చిత్రాల ప్రతిభావంతుడైన దర్శకుడు కదిరి వెంకట రెడ్డి

కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధుడైన కదిరి వెంకట రెడ్డి (జూలై 1, 1912 - 1972) తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత.

పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించాడు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలో రేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావు పాత్రలు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది.

సినీ ప్రస్థానం

సినిమాల గురించీ, సినిమా నిర్మాణం గురించీ తెలుసుకుని, పుస్తకాలు చదివి సినిమాలమీద అభిమానం పెంచుకున్న కె.వి.రెడ్డి, స్నేహితుడైన మూలా నారాయణస్వామి సలహా మీద గృహలక్ష్మి (1938 సినిమా)కి కేషియరుగా పనిచేశాడు. తరువాత వాహినీ సంస్థ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన వందేమాతరం (1939) సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశాడు.

ఇదే సినిమాకు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు సహాయ దర్శకుడిగా ఉన్నాడు. తరువాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమాలైన సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ అన్నింటికీ ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. వాహినీ సినిమాలలో ఈయన ప్రొడక్షన్‌ మేనేజరు, కాషియరూ ఐనా, ఆలోచనంతా సినిమా దర్శకత్వం, నిర్మాణం మీదనే ఉండేది.

భక్త పోతన

.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా భక్త పోతన (1942). భక్తపోతన పెద్ద హిట్‌ కావడంతో యోగివేమన (1947) తీశాడు, కె.వి.రెడ్డి. ఆర్థికంగా లాభించకపోయినా ప్రపంచ సినిమాల స్థాయిలో 'యోగివేమన' కూడా ఒక క్లాసిక్ అన్న ఖ్యాతి లభించింది.

ఈ రెండు సినిమాలలో కూడా చిత్తూరు నాగయ్య కథానాయకుడు. తరువాతి సినిమా గుణసుందరి కథ (1949). ఇందులో విషాద పాత్రలకు పేరు పొందిన శ్రీరంజని గుణసుందరీ దేవిగా నటించింది. ఈ సినిమాకు కె.వి.రెడ్డి మరియు కమలాకర కామేశ్వరరావు కలసి చిత్రానువాదం అందించగా, పింగళి నాగేంద్రరావు సంభాషణలు రాసాడు.

పాతాళ భైరవి

కె.వి.రెడ్డి మరియు విజయా సంస్థల పేర్లను ఆంధ్రదేశంలో ప్రతి ఒక ఇంట్లో మారుమోగేలా చేసిన పాతాళ భైరవి సినిమా 1951 సంవత్సరంలో విడుదలైంది. జానపదాల్లో పాతాళభైరవి అనేక విషయాల్లో మార్గదర్శకమైంది. ఈ సినిమా కథకు చందమామ పత్రికలో వచ్చిన ఒక కథ మూలం. నేపాలీ మాంత్రికుణ్ణి సంహరించి తన సాహసంతో ఉజ్జయినీ రాకుమార్తెను పొందే వీరుడిగా ఎన్.టి.రామారావు సరిగ్గా సరిపోయాడు. నేపాళీ మాంత్రికుడుగా అద్భుతంగా నటించిన ఎస్వీ రంగారావుకీ ఈ సినిమా ద్వారా మంచిపేరు వచ్చింది. ముఖ్యంగా సాహసం శాయరా డింభకా, రాకుమారి లభించునురా అన్న వాక్యం ప్రాచుర్యం పొందింది.

నేపాళీ మాత్రికునితో పాటు ఉండే డింగిరి పాత్రలో పద్మనాభం నటించాడు. ఉజ్జయినీ మహారాజుగా సి.ఎస్.ఆర్.ఆంజనేయులు నటించగా, అమాయక రాకుమారుని పాత్రలో రేలంగి నవ్విస్తాడు. ఈ సినిమాలోని ఒక పాటలో ప్రముఖ నటి సావిత్రి కనిపించడం విశేషం. ఈ చిత్రంలాగే ఇందులోని పాటలు కూడా అద్భుత విజయం సాధించాయి. ముఖ్యంగా కలవరమాయే మదిలో, ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడూ పాటలు ఆంధ్ర్రదేశమంతా మారుమోగాయి.

పెద్ద మనుషులు

పాతాళభైరవి లాంటి జానపదం తీసిన తరువాత 1954లో సాంఘిక చిత్రమైన పెద్ద మనుషులు చిత్రం విడుదలైంది. సాంఘికాల్లో పెద్ద మనుషులు చిత్రాన్ని కీర్తిస్తూ భూతో భవిష్యతి అన్నారు అప్పటి విమర్శకులు. పదవుల ఘరానా ముసుగులో అవతవకలకు పాల్పడే పెద్దలను విమర్శిస్తూ తీశారు ఈ సినిమా.

 పెద్దలు చేసే పనులలో లొసుగులను బయటపెట్టే తిక్క శంకరయ్య పాత్ర రేలంగి సినీ జీవితంలో మరపురాని పాత్రలలో ఒక్కటి. ప్రముఖ సినీ రచయిత డి.వి.నరసరాజుకు ఇదే తొలి సినిమా. కొసరాజు రాసిన శివ శివ మూర్తివి గణనాథా, నీవు శివుని కుమారుడవు గణనాథా పాట ఇప్పటికీ వినబడుతూంటుంది.

దొంగ రాముడు

దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావులు సినీ నిర్మాణ కంపెనీ ఆరంభించినా, కె.వి.రెడ్డి చేతనే తొలి చిత్రం తీయించాలని అనుకోవడంతో, ఆయన కోసం రెండేళ్లు పైచిలుకు కాలం నిరీక్షంచవలసి వచ్చింది. ఆ చిత్రం అన్నపూర్ణావారి దొంగరాముడు (1955).

ఈవాళ ఆ చిత్రం పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్థులకు బోధనాపాఠం. ఒక దొంగ తన తప్పులు తెలుసుకొని తనను తాను సంస్కరించుకొనే పాత్రలో ఏయన్నార్ చక్కగా నటించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు ఆర్.నాగేశ్వరరావుల మధ్య పోరాట సన్నివేశాలను అత్యంత సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో సావిత్రి పూలమ్మే అమ్మాయిగా నటించగా జమున, అక్కినేని నాగేశ్వరరావుకు చెల్లెలుగా నటించింది. సానుభూతి పరుడైన వైద్యునిగా కొంగర జగ్గయ్య నటించాడు.

మాయా బజార్

ఒక్క మాయాబజార్‌ సినిమా చాలు చిత్రానువాదం (స్క్రీన్‌ ప్లే) నడపడంలో కె.వి.రెడ్డి వైదుష్యం ఎంతటిదో అర్థం కావడానికి. ఆ చిత్రం ఎన్ని సార్లు చూసినా.., ఫలానా నన్నివేశం అనవసరమనో లేక ఇంకేదో సన్నివేశం అవసరం ఉందనో అనిపించదు.

 సినిమా మూడు గంటలపాటు నడిచినా ముప్పావుగంటలో అయిపోయిందన్న భ్రమ కల్పించడానికీ, సర్వకాలాల్లోనూ సర్వప్రేక్షకుల్నీ అలరిస్తూ ఆహ్లాదపరచడానికీ, ఆ చిత్రానువాదమే కారణం. తెలుగు సినిమా చరిత్రలో విడుదలైన అద్భుత చిత్రాలలో ఈ సినిమా ప్రథమ స్థానం అలంకరించిందంటే అది ఆ దర్శకచక్రవర్తి ప్రజ్ఞ. ప్రజ్ఞతో చేసిన తపస్సు. పాతాళ భైరవి తరువాత కెవి.రెడ్డి విజయా సంస్థకు చేసిన రెండవ సినిమా ఇది.

దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడితో వివాహం నిశ్చయమైన శశిరేఖను, ఘటోత్కచుడు తన మాయజాలంతో అపహరించి, తన ఆశ్రమంలో అభిమన్యుడితో వివాహం జరిపించడం, తాను మాయా శశిరేఖ అవతారం దాల్చడం, కౌరవులను ముప్పుతిప్పలు పెట్టడం, కృష్ణుడు వీటన్నిటికి పరోక్షంగా సహకరించడం, ఇవి ఈ చిత్రంలోని కథాంశాలు.

జగదేకవీరుని కథ

1958లో ఎ.ఎన్.ఆర్, జమున నటించిన పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి సాంఘికం చేసిన తరువాత 1961లో జగదేకవీరుని కథ లాంటి అద్భుత జానపదాన్ని తీశాడు కె.వి.రెడ్డి. ఇందులో నలుగురి కథానాయికలలో ఒకరిగా బి.సరోజాదేవి నటించింది.

ప్రతాప్ అనే రాకుమారుడు దేవకన్యలను పెళ్ళి చేసుకొనే కోరికతో బయలుదేరి, దేవతలనే మెప్పించి నాగ కన్య, అగ్ని పుత్రిక, వరుణుడి కుమార్తె, ఇంద్ర పుత్రికలను పెళ్ళాడటం ఈ చిత్రంలోని కథాంశం. ఇందులోని శివశంకరి పాట ఎంతో పేరుపొంది ఘంటసాల కీర్తిని శాశ్వతం చేసింది.

శ్రీకృష్ణార్జున యుద్దము

1962 సంవత్సరంలో తెలుగు సినిమాకు రెండు కళ్ళయిన రామారావు - నాగేశ్వరరావు కలసి నటించిన శ్రీకృష్ణార్జున యుద్ధం విడులైంది. మహాభారతంలోని పాత్రలను తీసికొని కల్పించిన కథతో ఈ చిత్రాన్ని తీసారు. గయుడు అనే గంధర్వుడు పుష్పక విమానంలో వెడుతుండగా తను నములుతున్న తాంబూలాన్ని భూమి మీదకు ఉమ్ముతాడు. అది సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని చేతులో పడుతుంది. దానితో ఆగ్రహించిన కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తానని శపథం చేస్తాడు. దానితో భీతిల్లిన గయుడు నారదుని సలహామీద, అసలు విషయం చెప్పకుండా అర్జునుని శరణు పొందుతాడు. తరువాత విషయం తెలిసికూడా ఇచ్చిన అభయం నిలబెట్టుకోవడం కోసం అర్జునుడు శ్రీకృష్ణుడితో పోరాడటం ఇందులోని కథాంశం.

సత్య హరిశ్చంద్ర

1965 సంవత్సరంలో కె.వి.రెడ్డి, హరిశ్చంద్రుని పాత్రలో ఎన్.టీ.ఆర్ ను, చంద్రమతి పాత్రలో ఎస్.వరలక్ష్మిని తీసికొని సత్య హరిశ్చంద్ర చలన చిత్రాన్ని తీశాడు. విశ్వామిత్రునిగా ముక్కామల నటించగా, కాటికాపరి పాత్రలో రాజనాల నటించాడు.

శ్రీకృష్ణసత్య

1972 సంవత్సరంలో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చివరి చిత్రం శ్రీకృష్ణ సత్య విడుదలైంది. కృష్ణుని పాత్రలో మళ్ళీ ఎన్.టీ.ఆర్ నటించగా, సత్యభామ పాత్రలో జయలలిత నటించింది. .

దర్శకత్వ శైలి

నిర్మాణ శాఖనీ, దర్శకత్వ శాఖనీ రెంటినీ ఆకళింపు చేసుకున్న వ్యక్తి కె.వి.రెడ్డి. ఏ చిత్రం తాను నిర్దేశకత్వం చేసినా, పథకం అంతా తనే సిద్ధం చేసేవాడు. వేసుకున్న బడ్జెట్‌లోనే సినిమా తియ్యడం సాధ్యంచేసుకున్నట్టుగానే రాసుకున్న సినిమా నిడివిని దాటకుండా, సుసాధ్యం చేసుకోగలిగిన దర్శకుడు కె.వి.రెడ్డి. నిడివి విషయంలో ఎంతో దూరాలోచన ఉండేది కె.వి.రెడ్డికి. అలాగే కె.వి.కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ. ఏది తీసినా, ఏది తలపెట్టినా కథాగమనానికీ, దృశ్యనిర్మాణానికీ అతను వెచ్చించవలసిన కాలం వెచ్చించవలసిందే. అందులో రాజీ ఉండదు. 'గుణసుందరి కథ' లో ‘శ్రీరంజని హీరోయినా?’ అన్నారు కొందరు - మిత్రులూ, పరులూ. పాతాళభైరవిలో "రామారావు పక్కన మాలతి ఏం బావుంటుంది?" అన్నారు వాళ్లే. మాయాబజార్‌లో అంత లావు సావిత్రి శశిరేఖా? ‘రేవతి ఛాయాదేవా?’ అన్నవాళ్లకి "అందుకే ఛాయాదేవి!" అని ఆయన సమాధానం ఇచ్చారు. అంతలావు తల్లి ఉన్నప్పుడు పక్కన కూతురిలో ఆ లావు కనిపించదని కె.వి. నమ్మకం.

శ్రీరంజని అయినా, మాలతి అయినా కథాపరమైన పాత్రలకి ఏ సమస్యా రాదన్నది ఆయన విశ్వాసం. బక్కచిక్కిన 'పోతన' పాత్రకి భారీమనిషి నాగయ్యేమిటి? - అని అప్పుడే వచ్చింది విమర్శ. నాగయ్య తన నటనతో, తన పర్సనాలిటీని మరపింపజేస్తాడని - కె.వి. ధీమా.

ఒక్క కథాగమనం, షూటింగ్‌ పథకాలూ అనే కాకుండా - అన్నీ నిశితంగా ఆలోచించే నిర్ణయించేవాడు కె.వి. చిన్న వేషాలు, పక్కవేషాలు, చెలికత్తెల వేషాల నిర్ణయంలో కూడా ఆ ఆలోచన ఉంటుంది. కె.వి. రెడ్డిని చూసినప్పుడు ‘ఈయనా? సినిమా డైరెక్టర్‌లా లేరే!’ అనుకునేవారు కొత్తవాళ్లు. ముతక ఖాదీపంచె, పొట్టిచేతుల చొక్కా, పర్సు, కాయితాలూ, పెన్నులతో ఎత్తయిన జేబు, భుజం మీద వేల్లాడుతూ కండువా -ఇదీ కె.వి. వేషధారణ. అందర్నీ ‘బ్రదర్‌!’ అని సంబోధిస్తూ ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవాడు.

షూటింగులో కె.వి.విధానమే వేరు. తానుగా చేసి చూపించడమో, నటించడమో చేసి చూపించేవాడు కాదు. చెప్పేవాడు కూడా కాదు. పాత్రధారుల్నే చెయ్యమనేవాడు. అది తనకి కావలసిన రీతిలో లేకపోతే, ఇంకోలాగా, ఇంకోవిధంగా చెయ్యమనీ, చెప్పమనీ - తను ఎన్నికచేసి ఖాయం చేసేవాడు.

ఎక్కువ తక్కువలుంటే చెప్పేవాడు. కళాకారులకి స్వతంత్రం వుండేది - దర్శకుని నియంత్రణా ఉండేది. షాటులో ఆరుగురు నటులుంటే - మాట్లాడే వారొక్కరే అయినా, ఫైనల్‌ రిహార్సల్సు ఆరు చేయించేవారు. ఒకొక్క రిహార్సలులోనూ ప్రతి ఒక్కరి రియాక్షనూ చూసేవారు. ఎక్కువ తక్కువలుంటే - సరిదిద్దేవాడు. టేకు ముందు మేకప్‌లు, లైటింగ్‌, కెమెరా పొజిషనూ అన్నీ ఓసారి సరిచూసుకుని ‘టేక్‌!’ చేసేవాడు.

ఐతే, ఆయన ఏనాడూ ‘ఒకే!’ అని గట్టిగా అనలేదు. ‘పాస్‌!’ అనడమే ఆయన అలవాటు. అతని చిత్రాల్లో మంచిపాత్రలు ధరించి పేరు తెచ్చుకున్న రేలంగి, కె.వి.రెడ్డి "పాస్‌ మార్కులు ఇచ్చేవారే గానీ, నూటికి నూరు ఇవ్వడం మేము ఎరగం" అని చెప్పాడు.

కె.వి.రెడ్డి షూటింగుకి సందర్శకులకు అనుమతి ఉండేది కాదు. మరీ కావలసినాళ్లో, తప్పనిసరో అయితే ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవాళ్లు - అదీ పది, పదిహేను నిమిషాల్లో వెళ్లిపోవాలి. పూర్తి నిశ్శబ్దం, క్రమశిక్షణ, ఏకాగ్రత కనిపించేవి అతని షూటింగుల్లో.

చిత్రాలు దర్శకత్వం చెయ్యమని బయటి సంస్థల నుంచి ఎంత గిరాకీ వున్నా కె.వి.రెడ్డి అంగీకరించేవాడు కాదు. ఒక సినిమా అయిన తర్వాతే, ఇంకో సినిమా తియ్యాలనే తత్వం ఆయనది. "మిగతా డైరెక్టర్లు ఒకేసారి రెండుమూడు చిత్రాలు చేస్తున్నారుకదా!" అంటే - "ఐయామ్‌ సారీ! ఐ డోంట్‌ హావ్‌ టు బ్రెయిన్స్‌!" అన్నది కె.వి.సమాధానం.

జయాపజయాలు అనేవి అందరికీ వుంటాయి. అన్నిచోట్లా వుంటాయి. కె.వి.కీ వున్నాయి "చిత్రాలు విజయం పొందినప్పుడు ఎలా స్పందిస్తామో, పరాజయం పొందినప్పుడూ స్పందిస్తాం. రెండిటినీ సమానంగానే యాక్సెప్ట్‌ చెయ్యాలి!" అనేవాడు కె.వి.రెడ్డి.

విశేషాలు

 • చిత్ర నిడివి విషయంలో కె.వి.రెడ్డికి ఎంత దూరాలోచన అంటే - ఒక ఉదాహరణ : దృశ్యాల విభజన జరిగిన తర్వాత సంభాషణలు నిర్ధారించుకున్న తర్వాత ‘ఇంత నిడివి ఉండాలి’ అని నిర్ణయించుకున్న తర్వాత - సహాయకులచేత సీన్లు చదివించుకుని స్టాప్‌ వాచ్‌ పెట్టుకుని, టైముచూసుకుని, ‘పుటేజ్‌’ నోట్‌చేసుకోవడం - అతని అలవాటు. అలా ‘గుణసుందరి కథ’ (1949) లోని ఒకదృశ్యం విని - ‘ఎంతొచ్చింది?’ అని అడిగాడు. ‘రెండు నిమిషాలొచ్చింది’ అన్నాడు సహాయదర్శకుడు. 'కాదు, ఇంకో అరనిమిషం పెరుగుతుంది. ఎంచేతంటారా రాజుగారి వేషం వేస్తున్నది గోవిందరాజు సుబ్బారావు. మీరు చదివినట్టుగా ఆయన డైలాగులు చెప్పారు. ఇంకా తాపీగా చెబుతారు. అంచేత, ఆయన ఉన్న ప్రతి దృశ్యాన్నీ మనం వేసుకున్న టైముకి మరికొంత కలుపుకుంటూ రావాలి!' అని కె.వి. వివరించినట్టు - పింగళి నాగేంద్రరావు ఓసారి చెప్పాడు.
 • ‘జగదేకవీరుని కథ’ (1961) షూటింగ్‌ ఆరంభానికి నాలుగునెలల ముందే, కార్యక్రమాలు, షెడ్యూలు సిద్ధమైనాయి. ‘జలకాలాటలలో....’ పాట జనవరిలో పడింది. కాల్‌ షీట్‌ టైము ఉదయం ఏడుగంటలకి. జనవరి అంటే చలిరోజులు. నలుగురు అమ్మాయిలు ఆరున్నరకే రెడీ అయి, ఈతకొలనులోకి దిగాలి. నీళ్లు వెచ్చగా ఉంటే వాళ్లు హాయిగా దిగుతారు. లేకపోతే నసుగుతారు. పైగా చాలాసేపు నీళ్లలో ఉండాలి గనక - ‘ఆ పాట తీసే మూడుపూటలూ వేడి నీరు సరఫరా చెయ్యాలి’ అని నోట్‌ రాసి, ప్రొడక్షన్‌వారికి అందజేశాడు. షూటింగ్‌ వేళకి వెచ్చని నీళ్లు ‘పంపు’ కావడం, అనుకున్న షూటింగ్‌ రెండుపూటల్లోనే పూర్తికావడం జరిగాయి.

పని చేసిన సినిమాలు

దర్శకత్వం వహించినవి

 1. భక్త పోతన (1942)
 2. యోగి వేమన (1947)
 3. గుణసుందరి కథ (1949)
 4. పాతాళభైరవి (1951)
 5. పెద్దమనుషులు (1954)
 6. దొంగరాముడు (1955)
 7. మాయాబజార్ (1957)
 8. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
 9. జగదేకవీరుని కథ (1961)
 10. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
 11. సత్య హరిశ్చంద్ర (1965)
 12. భాగ్యచక్రం (1968)
 13. ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
 14. శ్రీకృష్ణసత్య (1971)

చిత్రానువాదం అందించినవి

 1. గుణసుందరి కథ (1949)
 2. దొంగరాముడు (1955)

కథ అందించినవి

 1. దొంగరాముడు (1955)
 2. మాయాబజార్ (1957)

నిర్మాతగా వ్యవహరించినవి

 • ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
 1. పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
 2. జగదేకవీరుని కథ (1961)
 3. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
 4. సత్య హరిశ్చంద్ర (1965)
 5. భాగ్యచక్రం (1968)

ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి  నీలం సంజీవరెడ్డి

నీలం సంజీవరెడ్డి (మే 18, 1913 - జూన్ 1, 1996) భారత రాష్ట్రపతి గా, గా, లోక్‌సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త.

వ్యక్తిగత జీవితం

ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913, మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి న్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది.

సంయుక్త మద్రాసు రాష్ట్రంలో

1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు.1940, 1945 ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులో ఉన్నాడు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు.

1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగాతో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. ఆ తరువాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్ళారు.

ఈ కాలంలో సంజీవరెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆయన ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి, పార్టీ పదవికి రాజీనామా చేసాడు. తరువాత పార్టీ పెద్దల వత్తిడిమేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.

ఆంధ్ర రాష్ట్రంలో

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 1955లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో

ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.

కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న తనపదవికి రాజీనామా చేసాడు. ఆపై సంజీవరెడ్డి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగాడు.

కేంద్రంలో

1964 జూన్ 9 న లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేరాడు. ఆపై రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 1967లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కూడా కొద్దికాలం మంత్రిగా చేసాడు. 1967లో నాలుగో లోక్‌సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసాడు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్‌సభ సభాపతి, సంజీవరెడ్డి.

1969 జూలై 19 న సభాపతి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసాడు. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల ఫలితంగా ఆయన, మరో తెలుగువాడు - వి.వి.గిరి - చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయాడు. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయ గ్రహణం పట్టింది. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదులో జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాడు.

1977లో ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, ఆంధ్ర ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టీ గెలిచిన ఒక్క స్థానమూ సంజీవరెడ్డిదే. మళ్ళీ లోక్‌సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి - ఈసారి నాలుగు నెలల్లోనే - రాష్ట్రపతి పదవికి పోటీ చేసాడు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి.

1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం ఆయనకు సమాధి నిర్మించింది.

విశిష్టతలు

 • సంజీవరెడ్డి నిజాయితీని తెలియజేసే ఒక సంఘటన: సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నపుడు, ఒక కాంట్రాక్టరు ఒక ఉత్తరంతో ఆయన వద్దకు వచ్చాడు. సంజీవరెడ్డి ఆప్తమిత్రుడి వద్దనుండి తెచ్చిన ఉత్తరం అది. దాన్ని ఆయన అందుకున్నాడుగాని, చించి చూడలేదు. కాంట్రాక్టరుతో ఇలా అన్నాడు. "నువ్వో కాంట్రాక్టరువని నాకు తెలుసు.. దీనిలో ఏమి రాసుందో కూడా తెలుసు. నీ క్షేమం కోరుకునేవాడివయితే, ఈ ఉత్తరం వెనక్కి తీసేసుకో. లేదూ, దీన్ని తెరిచి చూడమంటావా.., ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు" అని అన్నాడు. మరో మాట లేకుండా ఉత్తరాన్ని తీసేసుకున్నాడా కాంట్రాక్టరు.
 • ఎమర్జెన్సీ తరువాత 1977 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశమంతటా జనతాపార్టీ ప్రభంజనం వీచి, కాంగ్రెసు చిత్తుగా ఓడిపోగా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మొత్తం 42 స్థానాలకుగాను, జనతాపార్టీ 41 స్థానాల్లో ఓడిపోయి, ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. గెలిచిన ఆ ఒక్క జనతాపార్టీ వ్యక్తీ, సంజీవరెడ్డియే!
 • లోక్‌సభ సభాపతిగా రెండు సార్లు ఎన్నికై, రెండుసార్లూ రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై రాజీనామా చేసాడు. మొదటిసారి రాష్ట్రపతిగా ఓడిపోగా, రెండోసారి గెలిచాడు.
 • ఇప్పటివరకు రాష్ట్రపతిగా చేసినవారిలో సంజీవరెడ్డి నిర్విరోధంగా ఎన్నికయిన ఏకైక రాష్ట్రపతి.
 • 1969లో కాంగ్రెసు పార్టీ ఆధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవ రెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెసు పార్టీ చీలిపోయింది.
 • పుట్టపర్తి సాయిబాబాను దర్శించని అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో సంజీవరెడ్డి ఒకడు.
 • సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
 • 1958లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు బహూకరించింది.

ఆయన పలుకులు

తన స్వంత జిల్లా అనంతపురం యొక్క దుర్భిక్ష పరిస్థితుల గురించి ఆవేదనతో ఆయనిలా అనేవాడు: "ఇక్కడ పెన్నానదిలో ప్రవహించేది నీళ్ళు కాదు, ఇసుక “

సౌమ్యుడు, హాస్యనటులు, మనవతావాది - రమణారెడ్డి

తెలుగు సినిమా హస్యనటుల్లో రమణారెడ్డి (అక్టోబర్ 1, 1921 - నవంబరు 11, 1974) (తిక్కవరపు వెంకటరమణారెడ్డి) ప్రముఖుడు. సన్నగా పొడుగ్గా ఉండే రమణారెడ్డి అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు.

జననం

రమణారెడ్డి 1921, అక్టోబర్ 1 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జగదేవిపేటలో జన్మించాడు.

సినిమా విశేషాలు

లవకుశ సినిమాను నిర్మించిన శంకరరెడ్డి ప్రోత్సాహంతో రమణారెడ్డి తొలిసారిగా మాయపిల్లలో వేషం వేశాడు. ఆ చిత్రానికిరఘపతి వెంకయ్య కుమారుడైన ప్రకాశ్‌ దర్శకుడు. శంకరరెడ్డి, అతనూ కలిసి ఆ చిత్రంతీశారు. అందులో - వాహినివారి సుమంగళి, దేవత చిత్రాలలో నటించిన కుమారి హీరోయిన్‌. ఆ జానపద చిత్రంలో రమణారెడ్డిది మంచి హాస్య పాత్రే అయినా, చిత్రం సరిగా నడవకపోడంతో అది పదిమంది దృష్టిలో పడలేదు. బంగారుపాప , మిస్సమ్మ చిత్రాలతో రమణారెడ్డి ప్రతిభ ప్రేక్షకులకీ, పరిశ్రమకీ బాగా తెలిసింది. బంగారుబాలలో ముక్కుగొంతుపెట్టి మాట్లాడినట్టు - మిస్సమ్మ ‘లో డేవిడ్‌ పాత్రని ఉషారుగా, ‘ఓవర్‌ అనిపించినా పాత్రకి తగ్గట్టు చేసి - హాస్యం ఒలికించాడు. అంతకు ముందు వేషాల వేటలో, అనుభవం కోసం డబ్బింగ్‌ చిత్రాల్లో గాత్రదానం చేశాడు. 'నిజంగా దానమే చేశాను' కొంతమంది డబ్బులు ఎగ్గొట్టారు కూడా, అని చెప్పేవాడు రమణారెడ్డి.

రమణారెడ్డి ‘పలుకు’లో విశేషం ఉంది. అతను ఏ పాత్ర ధరించినా ఆ పాత్ర సగం శాతం నెల్లూరుమాండలికంలోనే మాట్లాడుతుంది. చివరికి ‘మాయాబజార్‌’ లోని చిన్నమయ పాత్ర కూడా ఆ భాష నుంచి తప్పించుకోలేదు. ‘నా భాష అది. ఎట్ట తప్పించుకుంటా?’ అనేవాడు ఆయన. కాకపోయినా, దర్శకులుకూడా ‘అతని ట్రెండ్‌లో వుంటేనే అందం. అవసరం అనిపిస్తే కాస్త మార్చవచ్చు’ అనేవాడు.

స్వవిశేషాలు

సినిమాలలో రాక మునుపు రమణారెడ్డి నెల్లూరులో శానిటరీ ఇన్స్‌పెక్టరుగా ఉద్యోగం చేస్తుండేవాడు. అది వదిలి పెట్టి సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చాడు. రమణారెడ్డికి ముందునుంచి మాజిక్‌ సరదా వుండేది. సినిమా వేషాలుదొరకనప్పుడూ, దొరికిన తర్వాత తీరిక దొరికినప్పుడూ, మాజిక్‌ నేర్చుకున్నారు. చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. శిష్యుల్ని తయారుచేసేవారు. ‘సేవాసంఘాల సహాయనిధికి’ అంటే, ఆ సంస్థ గుణగణాల్ని పరిశీలించి, ఉచితంగా మాజిక్‌ ప్రదర్శనలుఇచ్చేవారు. ‘ధనసంపాదన కోసం సినిమా వుంది. నా సరదా కోసం, ప్రజల సహాయం కోసం మాజిక్‌’ వుంది అనేవారు. కొన్ని చోట్ల ఖర్చులు మాత్రం తీసుకునేవారు.

కొన్ని షూటింగుల టైమ్‌లో విరామం దొరికితే, అందరి మధ్యా కూచుని చిన్న చిన్న ట్రిక్కులు చేసి, ‘అరెరె!’ అనో, ‘అబ్బా!’ అనో అనిపించేవారు. ఆరుద్ర కూడా చిన్నచిన్న మాజిక్‌లు చేసేవారుగనక, ఈ ఇద్దరూ కలిస్తే ఆ టాపిక్‌ వచ్చేది. కొత్తకొత్త ట్రిక్సూ వచ్చేవి. ఐతే రమణారెడ్డి ఆరోగ్యం అంత బాగుండేది కాదు. సినిమాల్లోకి వచ్చినప్పుడువున్న బక్క పర్సనాలిటీయే - అలా కంటిన్యూ అయింది. చాలామంది అలా అలా లావెక్కుతారుగాని, రమణారెడ్డి మాత్రం ఒకే పర్సనాలిటీ ‘మెయిన్‌టెయిన్‌’ చేశారు. అలా వుండడమే ఆయనకో వరం. ఆ శరీరం రబ్బరు బొమ్మ తిరిగినట్టు, చేతులూ, కాళ్లూ కావలసిన రీతిలో ఆడించేది. దబ్బున కూలిపోవడం, డభాలున పడిపోవడం రమణారెడ్డికి సాధ్యమైనట్టు తక్కినవాళ్లకి సాధ్యమయ్యేది కాదు. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలందరూ రమణారెడ్డిని కోరుకునేవారు. ‘రేలంగి - రమణారెడ్డి జంట’ చాలా సినిమాల్లో విజయవంతమైన జంట. కె.ఎస్‌ ప్రకాశరావు, తిలక్‌ వంటి దర్శకుల చిత్రాల్లో రమణారెడ్డి వుండితీరాలి.

వ్యక్తిగా రమణారెడ్డి సౌమ్యుడు. తెరమీద ఎంత అల్లరీ, ఆర్భాటం చేసి నవ్వించేవారో బయట అంత సీరియస్‌. ఏవో జోకులువేసినా సైలెంటుగానే ఉండేవి. గట్టిగా మాట వినిపించేది కాదు. మనసుకూడా అంత నెమ్మదైనదే. ఏనాడూ ఎవరి గురించీ చెడుమాట్లాడ్డమో, విమర్శించడమో చేసేవాడు కాదు. తన పనేదో తనది, ఒకరి సంగతి తనకక్కరల్లేదు. అంత నవ్వించినవాడూ తన ఆనారోగ్యాన్ని మాత్రం నవ్వించలేకపోయాడు. అది అతన్నిబాగా ఏడిపించింది. దరిమిలా ఆయన్ని తీసుకువెళ్లిపోయి అభిమానుల్ని ఏడిపించింది. ఆయన నవంబర్ 11, 1974న మరణించాడు.

హాస్యంతో కూడుకున్న లిటిగెంట్‌ వేషాలూ, తిప్పలుపెట్టే పాత్రలూ చూసినప్పుడల్లా రమణారెడ్డి, అతని కొంగ కాళ్లలాంటి చేతుల విసుర్లూ స్పీడుయాక్షనూ గుర్తుకు వస్తాయి. మరపురాని హాస్యనిధి రమణారెడ్డి!

తనమాటల్లో 'రమణారెడ్డి'

అప్పుడే నా చేత ప్రకాశరావు నారదుడి వేషం వేయించారు. ‘నేనునారదుడేమిటి? ఇవాళ నారదుడంటారు - రేపు హనుమంతుడంటారు’ అని వాదించాను. వినలేదు. విశాలమైన నావక్షస్థలం, అస్థిపంజరం కనిపించనీయకుండా ఫుల్‌ జుబ్బా తొడిగారు. ‘కృష్ణప్రేమ’లో సూర్యకుమారి ఆడది గనుక జుబ్బా తొడిగారు. నేను మగాణ్ని గనక నాకూ జుబ్బా తొడిగారు. తేడాలతో రెండూ వక్షస్థలాలకి సంబంధించినవే!’ అన్నారురమణారెడ్డి ఓసారి. తను చేసిన పాత్రల గురించి చెబుతూ. ‘ధనసంపాదన కోసం సినిమా వుంది. నా సరదా కోసం, ప్రజల సహాయం కోసం మాజిక్‌’ వుంది అనేవాడు.

"సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు " - గడ్డం రాంరెడ్డి

జి.రాంరెడ్డిగా సుపరిచితులైన గడ్డం రాంరెడ్డి (డిసెంబరు 4, 1929 - జూలై 2, 1995) దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (Father of Open Universities) గా పరిగణిస్తారు.

జననం

వీరు 1929 డిసెంబరు 4న కరీంనగర్ జిల్లా మైలారం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొంది పి.హెచ్.డి. స్వీకరించారు. 1977 వరకు అక్కడే ప్రొఫెసర్ గా పనిచేశారు. 1977 నుండి 1982 మధ్య కాలంలో ఉపసంచాలకులుగా పనిచేశారు. వీరు హైదరాబాదులోని భారత సమాజ విజ్ఞాన పరిశోధనా మండలి (Social Sciences Research Council), దక్షిణ ప్రాంతీయ కేంద్రానికి వ్యవస్థాపక డైరెక్టర్ గా సమాజ శాస్త్రంలో పలు ప్రయోగాలు చేశారు.

1980 దశాబ్దంలో వీరు దూరవిద్య వైపు దృష్టి మళ్ళించి దానిపై విశేషాధ్యయనం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ గురించి నిశితంగా పరిశీలించారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోరిక మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ప్రారంభించే విషయంలో ఒక నివేదిక సమర్పించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించి 1982 లో దేశంలో మొట్టమొదటగా ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. దీనిని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయముగా నామకరణం చేశారు. దీనికి మొదటి వైస్ ఛాన్సలర్ గా వీరిని నియమించారు. వీరి కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1985లో ప్రారంభించిన ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా నియమించింది. అక్కడ వారు చేసిన కృషి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

1991లో భారత ప్రభుత్వం వీరిని కొత్త ఢిల్లీలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ గా నియమించింది. ప్రపంచంలోని ప్రముఖ సార్వత్రిక విశ్వవిద్యాలయాలను పరిశీలించి సార్వత్రిక వ్యవస్థకు ఒక చక్కని నమూనా తయారుచేసి తొలిసారిగా ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. ఈ నమూనా పలుదేశాలలో సార్వత్రిక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకోడానికి తోడ్పడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి వీరిని సలహాదారుగా నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ లోను మరియు భారతదేశంలోను కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దూరవిద్యా విభాగానికి వీరి పేరుపెట్టారు. వీరికి 1994లో ప్రతిష్ఠాత్మకమైన శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం ప్రదానం చేశారు.

మరణం

దూరవిద్యా పితామహులైన రాంరెడ్డి గారు లండన్లో జూలై 2, 1995లో పరమపదించారు.

తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డ్ గ్రహీత - సింగిరెడ్డి నారాయణ రెడ్డి ( సినారె)

సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931), తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి

బాల్యం, విద్యాభ్యాసం

సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు.

ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు.

ఉద్యోగం

ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడుఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి.

కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.

సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

పురస్కారాలు

 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
 2. కేంద్ర సాహిత్య అకాడెమీ
 3. భారతీయా భాషా పరిషత్
 4. రాజలక్ష్మీ పురస్కారం
 5. సోవియట్-నెహ్రూ పురస్కారం
 6. అసాన్ పురస్కారం

మొదలైనవి ఆయన్ను వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

కుటుంబం

ఆయనది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి.

పదవులు

విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు.

 1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
 2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
 3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
 4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
 5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు

భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు.

రచనలు

కవిత్వం:

 • విశ్వంభర
 • మనిషి - చిలక
 • ముఖాముఖి
 • భూగోళమంత మనిషి
 • దృక్పథం
 • కలం సాక్షిగా
 • కలిసి నడిచే కలం
 • కర్పూర వసంతరాయలు
 • మట్టి మనిషి ఆకాశం
 • తేజస్సు నా తపస్సు
 • నాగార్జున సాగరం
 • విశ్వనాథ నాయడు
 • కొనగోటి మీద జీవితం
 • రెక్కల సంతకాలు
 • వ్యక్తిత్వం

వ్యాసాలు:

 • పరిణత వాణి

గేయనాటికలు:

 • అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం.
 • వెన్నెలవాడ

రచనారంగమే కాక ఆయన తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.

సినీ ప్రస్థానం

సినిమా పాటలు

సి.నారాయణ రెడ్డి 1962 లో గులేబకావలి కథ లోని పాటలను రచించుట వల్ల సినిమా ప్రస్థానం లోకి అడుగు పెట్టారు. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాటతో పేరుపొందారు. తర్వాత చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశాడు.

పురస్కారాలు

 • డాక్టరేటు డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో
 • 1988వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
 • ఉత్తమ పాటల రచయిత - ఇదిగో రాయలసీమ గడ్డ, సీతయ్య చిత్రానికి నంది పురస్కారం
 • డా. బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రసంశపత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,తెలుగు విశ్వవిద్యాలయం, 19.09.2014).

ప్రశంసలు

డా.సి. నారాయణరెడ్డి గురించి ప్రముఖుల ప్రశంసలను చీకోలు సుందరయ్య ఇలా ఉదహరించాడు

 • చేరా - "ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు.
 • ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం - "విశ్వమానవ హృదంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం"
 • సాహితీ చరిత్ర రచయిత డాక్టర్‌ జి.నాగయ్య - "ప్రణయ కవిత్వమును, చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి.నారాయణరెడ్డిగారు పద్యమును, గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. ఛందోరహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమున కనుగుణముగా ప్రగతి మార్గములో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు.
 • నారాయణరెడ్డి ఏదో ఒక 'ఇజము'నకు కట్టుబడక సమకాలిక సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి చక్కని గేయాలు రచించి వాటిని సంపుటాల కెక్కించాడు... నారాయణరెడ్డి కావ్యాలలో మధ్యతరగతివారి కష్టసుఖాలే ఎక్కువగా కనబడతాయి...
 • కులమతమ్ముల ఉక్కుడెక్కల, నలిగిపోయెడు మాలలంగని, అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని ఆయన గురజాడకు కైమోడ్పు ఘటించాడు. ఆకలి వాకిట కేకలు పెట్టిన, ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా వీరు శ్రీశ్రీని అభినందించారు

వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు - "నారాయణరెడ్డి తిలక్‌లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతం కురిపించగలడూ.

కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు - పులికంటి కృష్ణారెడ్డి

పులికంటి కృష్ణారెడ్డి (జూలై 30, 1931 - నవంబర్ 19, 2007) కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు.

జననం

1931, జూలై 30 న చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జక్కిదోన గ్రామంలో రైతు కుంటుంబంలో జన్మించాడు. 13 సంవత్సరాలపాటు భారతీయ రైల్వేలో ఉద్యోగం చేసిన ఆయన నాటకాల మీద మక్కువతో దాన్ని వదులుకున్నాడు.

ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసాడు.

రాయలసీమ జీవన వ్యథల్ని దాదాపు 200 కథలుగా వెలువరించిన ఈయన గూడుకోసం గువ్వలు, పులికంటి కథలు, పులికంటి దళిత కథలు, పులికంటి కథావాహిని సంపుటాలను తెచ్చాడు. తిరుపతి పరిసర ప్రాంత జనజీవనాన్ని ప్రతిబింబించే నాలుగ్గాళ్ళ మండపం ఈయనకు ఎక్కువ పేరు తెచ్చింది. ఈయన రాసిన అమ్మిపాటలు ఎంకిపాటలకు దీటుగా నిలిచాయి.

అగ్గిపుల్ల' నవలకు చక్రపాణి అవార్డు లభించింది. ఆకాశవాణి, దూరదర్శన్ లలో ఆడిషన్‌ కమిటీ సభ్యుడిగా, సలహాదారునిగా కొంతకాలం వ్యవహరించాడు. నటుడిగా, రచయితగా కవిగా పలుబిరుదులు, సన్మానాలు అందుకున్నాడు. ఆయన రచనలపై పరిశోధనలు చేసిన నలుగురు పీహెచ్‌డీ, ముగ్గురు ఎంఫిల్‌ పట్టాపొందాడు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 2005లో ఆయనను గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. తన సాహితీ, కళారంగాల కృషికిగాను ఎన్నో ఆవార్డులు, రివార్డులు పొందిన ఈయన పులికంటి సాహితీ సత్క­ృతి సంస్థను స్థాపించి ఏటా సాహిత్య, కళా రంగాలలో విశేష కృషి చేసిన వారిని సత్కరిస్తున్నాడు. ప్రముఖులపై వివిధ సందర్భాలలో పులికంటి రాసిన వ్యాసాలను పులికంటి హృదయ చిత్రాలు పేరుతో పుస్తకంగా తెచ్చాడు.

తిరుపతిలో 2007 నవంబరులో జరగనున్న తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సందర్భంగా సన్మాన గ్రహీతల్లో కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. అయితే ఈ లోపే, 2007, నవంబర్ 19 న పులికంటి కన్నుమూశాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి - భవనం వెంకట్రామిరెడ్డి

భవనం వెంకట్రామ్ (జూలై 18, 1931 - ఏప్రిల్ 7, 2002) అని అందరూ పిలిచే భవనం వెంకట్రామిరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. ఈయన 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్య మంత్రులు నారా చంద్రబాబునాయుడు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈయన మంత్రి వర్గములోనే కలసి మంత్రులుగా పనిచేశారు.

వెంకట్రామ్ 1931 జూలై 18 న గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలము గొల్లపాడు గ్రామములో జన్మించాడు. ఈయన గుంటూరు పట్టణములో న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేసేవాడు. రాజకీయాలలో రాకముందు ఈయన పూర్వపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములో మంత్రి అయిన కందుల ఓబులరెడ్డి దగ్గర పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో విద్యా శాఖా మంత్రిగా చేరి శాసన మండలికి నియమితుడైనాడు. వెంకట్రామిరెడ్డి కుల రాజకీయాలకు వ్యతిరేకముగా పేరులోని రెడ్డి విడచి ఆ తరువాత అధికారములోకి వచ్చిన అంజయ్య మంత్రివర్గములో కూడా మంత్రిగా కొనసాగాడు.

1982లో ఈయన కాంగ్రేసు పార్టీ అధిష్టాన వర్గము యొక్క అండతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి తన పాత రూం మేట్ అయిన ఎన్.టి.రామారావుని ఆహ్వానించాడు. అక్కడే రామారావుకు రాజకీయాలలోకి రావలన్న ఆలోచనకు బీజము పడినదని చెబుతారు.

పలనాడు ప్రాంతానికి చెందిన వెంకట్రాం నందమూరి తారక రామారావుకు గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఎ.సి.కాలేజి)లో చదివే రోజులలో సన్నిహిత స్నేహితుడు. 7 నెలల పాలన తర్వాత ఈయన అధిష్టాన వర్గము కోరిక మేరకు రాజీనామా చేసి కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గము సుగమము చేశాడు.

1982లో దేశములోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ) ను నెలకొల్పడము వెంకట్రామ్ ముఖ్యమంత్రిగా సాధించిన పనులలో ఒకటి. కొంతకాలం రాజకీయ సన్యాసము తరువాత వీ.పీ.సింగ్ యొక్క జనతా దళ్ పార్టీలో చేరి తిరిగి కాంగ్రేసు కొచ్చాడు. 2000లో రాం విలాస్ పాశ్వాన్, లోక్ జన శక్తి అనే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఈయన ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ శాఖా అధ్యక్షుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

ఈయన భార్య భవనం జయప్రద 1967 నుండి 1978 వరకు వినుకొండ నియోజక వర్గము నుండి శాసనసభ సభ్యురాలు. ఈమె పి.వి.నరసింహారావు మంత్రివర్గములో విద్యుచ్ఛక్తి శాఖా మంత్రిగా మరియు జలగం వెంగళరావు మంత్రివర్గములోను మంత్రిగా పనిచేసినది. వీరికి ఇద్దరు కుమార్తెలు.

మరణం

వెంకట్రామ్ 2002 ఏప్రిల్ 7 న 71 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రిలో మరణించాడు.

ఎమ్మెల్సీ నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన ప్రజానాయకుడు - నేదురుమల్లి జనార్ధన రెడ్డి

నేదురుమల్లి జనార్థన్ రెడ్డి (Nedurumalli Janardhana Reddy) 1935, ఫిబ్రవరి 20న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వాకాడులో జన్మించాడు.  భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలలో ఒకడైన జనార్థన్ రెడ్డి 1992-94 కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2004 లోకసభ ఎన్నికలలో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఇటీవల 2009, మార్చి 16న రాజ్యసభకు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యాడు. ఇతని భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి 2004 శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందింది.

బాల్యం మరియు వ్యక్తిగత జీవితం

నేదురుమల్లి జనార్దనరెడ్డి 1935, ఫిబ్రవరి 20న శేషమ్మ, సుబ్బరామిరెడ్డి దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు గ్రామంలో జన్మించాడు. నెల్లూరులో బి.ఏ., బి.ఎడ్. వరకు విద్యనభ్యసించాడు. 1962, మే 25న రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. భార్య రాజ్యలక్ష్మి 2004లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినది.

రాజకీయ ప్రస్థానం

1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) కార్యదర్శిగా నియమించబడ్డాడు. 1978లోనే ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో పదవి కూడా పొందినాడు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకు ఆ పదవిలో ఉన్నాడు. 1988లో ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1989లో మళ్ళీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిమండలిలో చోటు సంపాదించాడు. మర్రిచెన్నారెడ్డి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు జనార్దనరెడ్డి చేపట్టినాడు.

1992లో రాజీనామా చేసే వరకు ఈ పదవిలో ఉండి, 1998లో 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1999లో 13వ లోక్‌సభకు మళ్ళీ ఎన్నికయ్యాడు. ఈ కాలంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పనిచేశాడు. అతిముఖ్యమైన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించాడు. 2004లో 14వ లోక్‌సభకు విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికై మూడవసారి లోక్‌సభకు వెళ్ళినాడు.

ఇదివరకు తన స్వంత నియోజకవర్గం రిజర్వ్‌డ్‌గా ఉండటంతో నెల్లూరు నుండి పోటీచేయడానికి వీలులేకపోగా, తాజాగా పునర్విభజనలో జనరల్ స్థానంగా మారిన నెల్లూరు నుండి పోటీచేయాలని తలచిననూ జనార్దనరెడ్డికి సీటి లభించలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళవలసి వచ్చింది.

ముఖ్యమంత్రిగా

1991లో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలకు నైతిక బాధ్యత వహిస్తూ మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయగా ఆయన స్థానంలో కాంగ్రేస్ అధిష్టానం నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో వివిధ ముఠాలను అదుపులో పెట్టడంలో సమర్ధుడైన జనార్ధనరెడ్డి పార్టీలో అసమ్మతిని అదుపుచేయటానికి అనేక చర్యలు చేపట్టాడు. శాసనసభా సభ్యుల మద్దతు కూడగట్టుకోవటానికి వాళ్ళకు హైదరాబాదులోని సంపన్న ప్రదేశాలలో స్థలాలు మంజూరు చేశాడు. టెలిఫోను బిల్లులకై ప్రత్యేక అలవెన్సులు, కార్లు కొనుక్కొవడానికి సులువైన ఋణాలు ఇప్పించాడు.

1992 జూన్ లో సీటుకు ఐదు లక్షల చొప్పున కాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునే ప్రైవేటు యాజమాన్యంలోని 20 ఇంజనీరింగు మరియు వైద్య కళాశాలలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విధంగా కళాశాలలను స్థాపించడానికి పర్మిట్లు పొందిన అనేక సంస్థలు సారా వ్యాపారులు, ఎక్సైజు కాంట్రాక్టర్లు మరియు మంత్రులు పెట్టుబడి పెట్టినవే. వీటికి అనుమతులు మంజూరు చేయడానికి జనార్ధనరెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని వదంతులు వ్యాపించాయి.

ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తీర్పుగా ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కళాశాలకు అనుమతులు మంజూరు చేయడంలో అనేక అవకతవకలు జరిగినట్టు నిర్ణయించి, అనుమతి జారీ చేస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును రాజ్యంగ విరుద్ధమని కొట్టివేసింది.

హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీలోని అసమ్మతి వర్గాల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో కోట్ల విజయభాస్కరరెడ్డిని కాంగ్రేసు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది.

హత్యాయత్నం

సెప్టెంబర్ 7 2007లన రిమోట్ కంట్రోల్ ద్వారా మావోయిస్టులు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కారు పేల్చివేయడానికి కుట్రపన్నగా జనార్థన్ రెడ్డి, ఆయన భార్య రాజ్యలక్ష్మి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందారు.

నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992 మేలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించబడినందుకు ఆయన నక్సలైట్ల హిట్‌లిస్టులో ఉన్నారు. 2003లో కూడా ఇదే తరహా దాడి జరుపగా తప్పించుకున్నాడు.

గుర్తింపులు

 • 2007 డిసెంబరులో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం జనార్థన రెడ్డికి డాక్టరేట్ ప్రధానం చేసింది.

జీవిత ముఖ్యాంశాలు

 • 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
 • 1978 నుంచి 84వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు.
 • 1989లో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు
 • 1990 నుంచి 92 వరకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
 • 1978 నుంచి 83 వరకు రాష్ట్ర రెవెన్యూ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.
 • 1978-83 మధ్య విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
 • 1989-90లో వ్యవసాయ, అటవీ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు
 • 1998-99లో బాపట్ల నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.
 • 1999 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా ఎన్నికయ్యారు.
 • 2004 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు.
 • 2009లో రాజ్యసభకు ఎంపికయ్యారు.
 • 2007లో నక్సల్స్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు.

మరణం

కాలేయ వాధ్యితో బాధపడుతూ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన 2014 మే 9, శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ట్రిపుల్ ఐటీ సృష్టికర్త - దబ్బల రాజగోపాల్ రెడ్డి

దబ్బల రాజగోపాల్ (రాజ్ రెడ్డి) (1937 జూన్ 13) ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు ట్యూరింగ్ అవార్డు గ్రహీత. ఆయన కంప్యూటర్ సైన్సు మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగాలలో ఖ్యాతి గడించాడు. ఆయన గత 40 సంవత్సరాలుగా స్టాన్‌ఫర్డు మరియు కార్నెగీ మిలన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా సేవలందిస్తున్నాడు. రోబోటిక్స్ సంస్థకు డైరక్టరుగా కూడా ఉన్నాడు.

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), హైదరాబాద్ నకు ఛైర్మన్ గా కూడా ఉన్నాడు. అల్ప అదాయ వర్గాల వారు, ప్రతిభావంతులైన యువకుల విద్యావసరాలను తీర్చడానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ స్థాపనకు సహాయం చేశాడు. ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు.

ఈ అవార్డు ఆయనకు 1994 లో వచ్చింది. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానం లో ఇచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడింది.

బాల్యం, విద్యాభ్యాసం

రాజ్ రెడ్డి చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం, కాటూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి శ్రీనివాసులు రెడ్డి. తల్లి పిచ్చమ్మ గృహిణి. ఆయన తాత ఒక భూస్వామి. దాన ధర్మాల వల్ల వారి ఆస్తి కరిగిపోయింది. రాజ్ రెడ్డి తల్లి దండ్రులకు ఏడుగురు సంతానం. నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. వారిలో రాజ్ రెడ్డి నాలుగోవాడు. రాజ్ రెడ్డి మొట్టమొదటిసారిగా తన గ్రామంలోని పాఠశాలలోనే ఇసుకలో అక్షరాలు నేర్చుకున్నాడు.

ఐదో తరగతి దాకా అదే ఊళ్ళో చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా శ్రీకాళహస్తి లో చదివాడు. పదో తరగతి లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడవడంతో మద్రాసు లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ చదవడానికి అవకాశం వచ్చింది. పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలోనే చదివాడు. ఇంటర్మీడియట్ లో ఆంగ్లమాధ్యమంలో చేరినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మెల్లగా ఆంగ్లం మీద పట్టు తెచ్చుకుని ఇంటర్మీడియట్ మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

ప్రతిభ, మౌఖిక పరీక్ష ఆధారంగా గిండీ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు దొరికింది. 1958 లో చెన్నైలో మద్రాసు విశ్వవిద్యాలయానికి చెందిన గిండీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ప్రస్తుతం అన్నా విశ్వవిద్యాలయం) నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ పట్టా పుచ్చుకున్నాడు.

ఉద్యోగం

మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి కాగానే మద్రాసు పోర్టు ట్రస్టులో ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయన జీతం మూడు వందల రూపాయలు. ఉద్యోగం చేస్తున్నపుడే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియాలో పై చదువులకోసం దరఖాస్తు చేశాడు.

అలా 1960 లో ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు. మాస్టర్ డిగ్రీ చేసేటపుడే కంప్యూటర్ల మీద కలిగిన ఆసక్తి వలన ఐబీయంలో ఉద్యోగంలో చేరి అక్కడే మూడేళ్ళపాటు పనిచేసి కంప్యూటర్ మెళకువలు తెలుసుకున్నాడు. కంప్యూటరు గురించి మరింత పరిశోధన చేయాలన్న తపనతో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీకి దరఖాస్తు చేశాడు.

1966 లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డాక్టరేటు సంపాదించాడు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో మొట్టమొదటి డాక్టరేట్‌ అందుకున్న ఘనత ఆయనదే.

అదే సంవత్సరం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన అధ్యాపక వృత్తిని ప్రారంభించాడు. తరువాత పిట్స్ బర్గ్ లోని కార్నెగీ మిలాన్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరాడు. అక్కడే ఆయన కెరీర్ కు బలమైన పునాది పడింది. కృత్రిమ మేధస్సు రంగం ప్రపంచాన్ని శాసిస్తుందని ఊహించి ఆ రంగం వైపు తన దృష్టి మళ్ళించాడు.

బోధనా వృత్తి

రాజ్ రెడ్డి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కొద్దికాలం ఆచార్యుడిగా పనిచేశాడు. తరువాత కార్నెగీ విశ్వవిద్యాలయం లో రోబోటిక్స్ ప్రొఫెసరుగా ఉన్నాడు. 1960 నుండి రాజ్ రెడ్డి ఆస్ట్రేలియా లో ఐ.బి.ఎం లో పనిచేశాడు. 1969 లో ఆయన కార్నిగీ యూనివర్సిటీనందు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరాడు. 1973 నుండి ఆయన పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా నియమింపబడ్డాడు. 1984 లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు.

ఆయన "రోబోటిక్స్ ఇనిస్టిట్యూట్ "కు వ్యవస్థాపక డైరక్టర్ గా ఉన్నాడు.

1979 నుంచి  1991 దాకా  మరియు 1991 నుండి 1999 మధ్య కాలంలో కార్నెగీ మిలన్ యూనివర్సిటీ కంప్యూటర్ విభాగానికి డీన్ గా కూడా వ్యవహరించాడు. ఆ సమయంలోనే లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇనిస్టిట్యూట్ మరియు మానవ-కంప్యూటర్ అన్యోన్యత, సెంటర్ ఫర్ ఆటోమేటెడ్ లెర్నింగ్ అండ్ డిస్కవరీ మరియు ఇనిస్టిట్యూట్ ఫర్ సాఫ్ట్‌వేర్ రీసర్చ్ లను ఏర్పాటు చేశాడు.

ట్రిపుల్ ఐటీ సృష్టికర్త

అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు అభ్యర్థన మేరకు రాష్ట్రంలో ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటుకు మార్గదర్శిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఉండటానికి అంగీకరించాడు. విద్యార్థులకు ఐటీలో పరిశోధనలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో తొలి ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేశాడు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్కు ఛైర్మన్ మరియు ఛాన్సిలర్ గా వ్యవహరించాడు.. రెడ్డి గారు 1999 నుండి 2001 లో యేర్పాటు చేయబడిన "ప్రెసిడెంట్స్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరీ కమిటీ" (PITAC) కు సహ ఛైర్మన్ గా ఉన్నారు.

రోబోటిక్స్ లో కృషి

భవిష్యత్తులో మనుషులు చేయాల్సిన చాలా పనుల్ని రోబోలు చేస్తాయని ఆయన బృందం ముందుగానే ఊహించింది. ఆయన పని చేస్తున్న విశ్వవిద్యాలయానికి ఆ రంగంపైన ఆసక్తి కలిగి దానికోసం ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలా కోట్ల రూపాయల ఖర్చుతో మొట్టమొదటి రోబోటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ని నెలకొల్పి దానికి పన్నెండేళ్ల పాటు వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పటికీ ప్రపంచంలో అదే అతిపెద్ద రోబోల పరిశోధనా కేంద్రం.

రోబోలకు మాటలూ, భాషలూ నేర్పించడం, పదాల్ని గుర్తుపెట్టుకునే శక్తినివ్వడం, మాటల ద్వారా ఇచ్చిన ఆదేశాలకు స్పందించడం లాంటి అనేక అంశాలను మొదట అభివృద్ధి చేసింది శాస్త్రవేత్తల బృందంలో ఆయన ముఖ్యుడు.

కృత్రిమ మేధస్సులో ఆయన పరిశోధనలకు గుర్తింపుగా ఆసియాలోనే తొలిసారి ప్రతిష్ఠాత్మక అలన్‌ ట్యూరింగ్‌ అవార్డు దక్కింది. రోబోటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ స్థాయికొచ్చాక యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌కు పదేళ్లపాటు డీన్‌గా ఉన్నత హోదాలో పనిచేశాడు. అమెరికన్‌ ఆసొసియేషన్‌ ఫర్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.

బిల్‌ క్లింటన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఐటీ సలహా సంఘానికి కో-ఛైర్మన్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం నిరుపేదలకూ సామాన్యులకూ ఉపయోగపడే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాజెక్టుకు ఆయన చీఫ్‌ సైంటిస్టుగా పనిచేశాడు.

తక్కువ ఖర్చులోనే కంప్యూటర్లను తయారు చేసి 80వ దశకం తొలిరోజుల్లోనే ఆఫ్రికా దేశాల్లోని పాఠశాలలకు వాటిని అందేలా చూశాడు. వైద్యం, రోడ్డు ప్రమాదాల నివారణ, మందుపాతర్లూ, ప్రకృతి విపత్తుల గుర్తింపు లాంటి అనేక రంగాల్లో ఉపయోగపడేలా రోబోల తయారీకి పునాది వేశాడు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మిట్టరాండ్‌ స్వయంగా అమెరికా వచ్చి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారమైన లీజియన్‌ ఆఫ్‌ ఆనర్‌ను అందించాడు.